Sourav Ganguly: కోహ్లీకి షోకాజ్ నోటీసు వార్త‌ల‌పై గంగూలీ స్పంద‌న‌

  • ఆ వార్త‌ల‌ను తోసిపుచ్చిన గంగూలీ
  • ఆ ప్ర‌చారం అర్థరహితమని వ్యాఖ్య‌
  • ఆ వార్త‌ల్లో  నిజం లేదని స్పష్టీకరణ 
  • ఇటువంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయోనంటూ ఆగ్ర‌హం
ganguly on notices to kohli

క్రికెటర్ విరాట్‌ కోహ్లీకి షోకాజు నోటీసు జారీ చేయాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భావించ‌గా, బీసీసీఐ కార్యదర్శి జయ్ షా జోక్యం చేసుకుని గంగూలీకి సర్దిచెప్పినట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ వార్తలను గంగూలీ తోసిపుచ్చుతూ, ఆ ప్ర‌చారం అర్థరహితమని చెప్పారు. ఆ వార్త‌ల్లో  నిజం లేదని, అస‌లు ఇటువంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియట్లేదని అన్నారు.  

విరాట్ కోహ్లీ గత ఏడాది టీ20 సార‌థ్య బాధ్య‌త‌ల‌కు గుడ్ బై చెప్పాడు. అనంత‌రం బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ  వన్డే జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి కూడా కోహ్లీని తప్పిస్తూ ఆ బాధ్య‌త‌లు రోహిత్ శ‌ర్మ‌కు అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో దక్షిణాఫ్రికా పర్యటన ముందు మీడియా సమావేశంలో వన్డే కెప్టెన్సీ గురించి కోహ్లీ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

టీ20 కెప్టెన్సీని వదులుకోవద్దని ఎవరూ చెప్పలేదని ఆయ‌న అన్నాడు. అయితే, వన్డే కెప్టెన్‌గా తొలగిస్తున్నట్లు కేవలం గంటన్నర ముందే సమాచారం ఇచ్చారని చెప్పాడు. కెప్టెన్సీని వదులుకోవద్దంటూ కోహ్లీతో తాను మాట్లాడానని గంగూలీ చేసిన ప్రకటనకు కోహ్లీ వ్యాఖ్య‌లు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే కోహ్లీకి షోకాజ్‌ నోటీసులు పంపాల‌ని గంగూలీ భావించారంటూ ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి.

More Telugu News