Property Registration: తెలంగాణ రాష్ట్రంలో పెరగనున్న ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చార్జీలు?

Property Registration Rates goas up in Telangana
  • 20-50 శాతం మధ్య పెంపు
  • అధికారుల కసరత్తు మొదలు
  • రెండు రోజుల్లో ఒక రూపు
  • ఇక రెండేళ్లకోసారి పెంచే ప్రతిపాదన

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఫ్లాట్లు, ఇళ్ల కొనుగోళ్లు భారంగా మారనున్నాయి. ఎనిమిది నెలల వ్యవధిలోనే తిరిగి మార్కెట్ విలువలు పెంచేందుకు సర్కారు సిద్ధమైంది. రియల్ ఎస్టేట్ బూమ్ తో గడిచిన నాలుగు నెలల్లో హైదరాబాద్, పరిసర ప్రాంతాలతో పాటు, ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. దీంతో మార్కెట్ విలువలను పెంచాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించినట్టు తెలుస్తోంది.

‘‘పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయేతర ప్రాపర్టీల ధరలను ప్రభుత్వం ఆరు నెలలకు ఒకసారి, వ్యవసాయ ప్రాపర్టీల ధరలను రెండేళ్లకోసారి పెంచొచ్చు. కానీ, ప్రస్తుతం అన్నింటి ధరలను పెంచనుంది’’ అని అధికార వర్గాల కథనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూముల ధరలు పెద్ద ఎత్తున పెరిగినట్టు సర్కారు గుర్తించింది. దీంతో మార్కెట్ ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ల ధరలు కూడా ఉండాలని భావిస్తోంది. తద్వారా మరింత ఆదాయం సమకూరుతుందన్న ఆలోచనతో ఉంది.

ఉమ్మడి రాష్ట్రంలో 2013లో మార్కెట్ విలువలను పెంచారు. ఆ తర్వాత  2021 జూలైలో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ధరలను సవరించారు. దీంతో రిజిస్ట్రేషన్ల రూపంలో 2021-22లో రూ.10,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని సర్కారు అంచనా వేసుకుంది. ఇప్పుడు మరో విడత పెంపుతో అదనంగా రూ.3,000-4,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా.

వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు రెండు రోజుల్లో ప్రతిపాదనలను సిద్ధం చేసి కేబినెట్ ముందుంచనున్నారు. 20-50 శాతం మధ్య ఈ పెంపు ఉంటుందని తెలుస్తోంది. కేబినెట్ ఆమోదం అనంతరం ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం వుంది. ఇకపై ప్రతి రెండేళ్లకోసారి ధరలను సవరించాలన్న ప్రతిపాదన కూడా ఉంది.

  • Loading...

More Telugu News