Janasena: సీఎంను చంపుతానంటూ పోస్టు చేసిన వ్యక్తితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు: జనసేన

  • సీఎంను చంపుతానంటూ పోస్టు
  • రాజుపాలెపు ఫణి అనే వ్యక్తి అరెస్ట్
  • మీడియా ముందు హాజరుపర్చిన సైబర్ క్రైమ్ ఎస్పీ
  • జనసేన మద్దతుదారుడని వెల్లడి
  • తప్పుడు పోస్టులు చేసేవారిని ఎప్పుడూ ప్రోత్సహించబోమన్న జనసేన
Janasena party media wing reacts to SP Radhika statement

సీఎం జగన్ ను హతమార్చుతానంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన రాజుపాలెపు ఫణి అనే జనసేన మద్దతుదారుడ్ని అరెస్ట్ చేశామని సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక వెల్లడించడం తెలిసిందే. ఎస్పీ ప్రకటన వెలువడిన కాసేపటికే జనసేన పార్టీ స్పందించింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవారిని జనసేన పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదని జనసేన పార్టీ మీడియా విభాగం స్పష్టం చేసింది.

ముఖ్యమంత్రిని చంపుతానంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యక్తికి, జనసేన పార్టీకి ఎలాంటి సంబంధంలేదని వెల్లడించింది. హింసను ప్రోత్సహించే, అశాంతిని కలిగించే, అసభ్యకర వ్యాఖ్యానాలు ఉండే పోస్టులను పార్టీ ఎప్పుడూ ఖండిస్తుందని వివరించింది. పార్టీ సానుభూతిపరుడు, పార్టీ అధ్యక్షుల వారి అభిమాని అనే ముసుగులో తప్పుడు పోస్టులు చేసేవారి పట్ల జనసేన నేతలు, జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ మీడియా విభాగం సూచించింది.

సోషల్ మీడియాలో హుందాగా వ్యవహరించాలని, వాస్తవిక విశ్లేషణా దృక్పథంతో, ఆలోచనాత్మకంగా, చైతన్యపరిచే విధంగా పోస్టులు ఉండాలని జనసేన పార్టీ కోరుకుంటుందని స్పష్టం చేసింది.

More Telugu News