మద్యం ఔషధం వంటిదన్న బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్... మండిపడిన కాంగ్రెస్

21-01-2022 Fri 20:14
  • మరోసారి వ్యాఖ్యల కలకలం రేపిన భోపాల్ ఎంపీ
  • ఓ క్రికెట్ మ్యాచ్ కు హాజరైన ప్రగ్యా ఠాకూర్
  • మద్యం మంచిదేనని వెల్లడి
  • అయితే స్వల్ప మోతాదులో తీసుకోవాలని సూచన
  • మితిమీరితే విషంలా పనిచేస్తుందని వెల్లడి
BJP MP Pragya Thakur talks about liquor consumption
వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టిందపేరైన బీజేపీ మహిళా ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరోసారి కలకలం రేపారు. స్వల్ప మోతాదులో మద్యం తీసుకుంటే అది ఔషధంలా పనిచేస్తుందని ప్రగ్యా ఠాకూర్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోక్ సభ స్థానం ప్రగ్యా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఓ స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆయుర్వేదంలో మద్యానికి స్థానం ఉందని, కొద్ది మొత్తంలో తీసుకుంటే అది శరీరానికి మేలు చేస్తుందని వివరించారు. అయితే మితిమీరి మద్యం సేవిస్తే అది విషంలా పనిచేస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వ కొత్త మద్యం పాలసీపై మీడియా ప్రశ్నించగా, ఆమె పైవిధంగా స్పందించారు.

అయితే, ప్రగ్యా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వెలిబుచ్చింది. మధ్యప్రదేశ్ పీసీసీ అధికార ప్రతినిధి నరేంద్ర సలూజా స్పందిస్తూ, ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మద్యాన్ని ఏమాత్రం వ్యతిరేకించడం లేదని, ఆమె కేవలం తీసుకోవాల్సిన మోతాదు గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు.