సీఎంను చంపుతానంటూ పోస్టు పెట్టిన జనసేన మద్దతుదారుడ్ని అరెస్ట్ చేశాం: ఏపీ సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక

21-01-2022 Fri 19:18
  • రాజుపాలెపు ఫణి అనే వ్యక్తి అరెస్ట్
  • సీఎంపై బెదిరింపులకు పాల్పడ్డాడని వెల్లడి
  • మానవబాంబుగా మారతానన్నాడని వివరణ
  • చట్టవ్యతిరేక పోస్టులు చేస్తే చర్యలు తప్పవని స్పష్టీకరణ
CID Cyber Crime SP Radhika press meet
ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక గుంటూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎంను చంపుతానంటూ రాజుపాలెపు ఫణి అనే జనసేన మద్దతుదారుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని వెల్లడించారు. సీఎంపై బెదిరింపులకు పాల్పడిన ఆ జనసేన మద్దతుదారుడ్ని అరెస్ట్ చేశామని తెలిపారు. మానవబాంబుగా మారి సీఎంను హతమార్చుతానని ట్విట్టర్ లో పోస్టు చేశాడని, తర్వాత ఆ పోస్టును డిలీట్ చేశాడని ఎస్పీ రాధిక వివరించారు.

అతడు తన అసలు పేరుకు బదులు కన్నా భాయ్ అనే అకౌంట్ ద్వారా పోస్టులు చేశాడని ఆమె వివరించారు. అనంతరం ఫోన్ స్విచాఫ్ చేసి హైదరాబాద్ వెళ్లిపోయాడని తెలిపారు. టెక్నాలజీ సాయంతో ఫణిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. చట్టవిరుద్ధంగా పోస్టులు పెట్టేవారిపై చర్యలు ఉంటాయని ఎస్పీ రాధిక స్పష్టం చేశారు. విచారణలో పవన్ అభిమానినని, జనసేన మద్దతుదారుడినని ఫణి చెప్పాడని వివరించారు.