టీడీపీలో బాగానే ఉన్నాడు.. వైసీపీలోకి వెళ్లిన తర్వాతే బూతుల మంత్రి, పేకాట మంత్రిగా మారాడు: కొల్లు రవీంద్ర

21-01-2022 Fri 14:47
  • ఇప్పుడు కేసినో మంత్రిగా కూడా మారారు
  • జగన్ ఆదిలోనే కల్పించుకుని ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు
  • రాబోయే రోజుల్లో ఆయన అరాచకం తీవ్ర స్థాయికి చేరుకుంటుందన్న రవీంద్ర 
Kodali Nani became as Casino minister says Kollu Ravindra
గుడివాడలో కేసినో వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో కేసీనో నిర్వహించారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిజనిర్ధారణ కోసం టీడీపీకి చెందిన ఓ టీమ్ ఈరోజు గుడివాడకు వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ, టీడీపీలో ఉన్నంత కాలం కొడాలి నాని బాగున్నాడని... వైసీపీలోకి వెళ్లిన తర్వాతే బూతుల మంత్రిగా, పేకాట మంత్రిగా మారిపోయాడని ఎద్దేవా చేశారు. కొడాలి నాని విషయంలో ఆదిలోనే సీఎం జగన్ స్పందించి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చి ఉండేది కాదని అన్నారు. ఇప్పుడు కేసినో మంత్రిగా కూడా మారారని... రానున్న రోజుల్లో ఆయన అరాచకం ఏ స్థాయికి చేరుకుంటుందో ఊహించడానికే కష్టంగా ఉందని చెప్పారు.
 
మాజీ ఎంపీ నారాయణరావు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోతున్నప్పటికీ... ఇంతవరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించని కొడాలి నాని... ఈరోజే తన కన్వెన్షన్ సెంటర్ లో ఎస్సీ సెల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని... ఇది అతనిలోని భయాన్ని సూచిస్తోందని అన్నారు.