బీజేపీలో చేరిన తర్వాత ములాయం ఆశీర్వచనాలు తీసుకున్న కోడలు

21-01-2022 Fri 14:18
  • ములాయం పాదాలకు నమస్కారం
  • విమానాశ్రయంలో ఘన స్వాగతానికి ధన్యవాదాలు
  • ట్విట్టర్ లో పోస్ట్ చేసిన అపర్ణ
After joining BJP Aparna Yadav takes blessing of Mulayam
సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ కోడలు, చిన్న కుమారుడి భార్య అపర్ణా యాదవ్.. తన మామ పట్ల గౌరవం చూపించారు. ఇటీవలే అపర్ణా యాదవ్ బీజేపీలో చేరారు. అప్పటి వరకు ములాయం సింగ్ యాదవ్ స్థాపించిన ఎస్పీలోనే పనిచేశారు. కానీ, బావ అఖిలేశ్ సారథ్యంలో ఇమడలేక ఆమె బయటకు వచ్చేశారు. అఖిలేశ్ తన తండ్రి ములాయంను సైతం పక్కన పెట్టేసి పార్టీని తన అధీనంలోకి తీసుకోవడం తెలిసిందే.

ఢిల్లీలో బుధవారం బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన అపర్ణ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. అనంతరం ఆమె నేరుగా లక్నోలోని తన మామ ములాయం సింగ్ నివాసానికి వెళ్లారు. ములాయం పాదాలకు నమస్కరించారు. ములాయం తలపై చేయి వేసి ఆమెను దీవించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

‘‘భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్న అనంతరం లక్నోకు వచ్చి తండ్రి/నేతాజీ నుంచి ఆశీర్వచనం తీసుకున్నాను’’ అని అపర్ణ ట్వీట్ చేశారు. ఢిల్లీ నుంచి లక్నో విమానాశ్రయానికి చేరుకున్న తనకు ఘనమైన ఆహ్వానం పలికిన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరో ట్వీట్ వదిలారు.