గుడివాడలో టీడీపీ నేతల అరెస్ట్... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేశ్

21-01-2022 Fri 14:14
  • గుడివాడలో క్యాసినో రగడ
  • నిజనిర్ధారణకు వెళ్లిన టీడీపీ బృందం
  • అడ్డుకున్న పోలీసులు
  • అక్రమంగా అరెస్ట్ చేశారన్న లోకేశ్
  • పోలీసులకు కళ్లు మూసుకుపోయాయని వ్యాఖ్యలు
Nara Lokesh furious after police arrests TDP leaders
కృష్ణా జిల్లా గుడివాడలో కొడాలి కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో ఏర్పాటు చేశారంటూ టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే. దీనిపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. అయితే, గుడివాడ వెళ్లి క్యాసినో నిగ్గు తేల్చేందుకు ప్రయత్నించిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వర్ల రామయ్య, బోండా ఉమ, ఆలపాటి రాజా, మరికొందరు ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాసినో నిర్వహించి ప్రజల నుంచి వందల కోట్లు కాజేసిన గడ్డం గ్యాంగ్ ను వదిలేసి నిజనిర్ధారణకు వెళ్లిన టీడీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. మహానుభావుల పురిటిగడ్డ గుడివాడను గడ్డం గ్యాంగ్ భ్రష్టుపట్టించిందని విమర్శించారు. మింగడానికి ఏమీ మిగలక ఆఖరికి జనాల ఒంటిపై ఉన్న గుడ్డలు సైతం లాగేసేందుకు ఏకంగా క్యాసినో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

కే కన్వెన్షన్ జూదానికి అడ్డాగా మారిన విషయం ప్రపంచం మొత్తానికి తెలిసినా, వైసీపీ రంగులతో కళ్లు మూసుకుపోయిన పోలీసులకు కనిపించలేదని లోకేశ్ విమర్శలు చేశారు. దీని వెనకున్న అసలైన సూత్రధారులపై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విచ్చలవిడిగా క్యాసినో నడిపినప్పుడు అడ్డురాని కొవిడ్ నిబంధనల పేరు చెప్పి టీడీపీ నేతలను అడ్డుకోవడం వైసీపీ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం అని లోకేశ్ వ్యాఖ్యానించారు.