సూర్యుడిపై పేలుడుతో ఎగసిపడిన జ్వాలలు.. రేపు, ఎల్లుండి భూ అయస్కాంత తుపాను ఏర్పడే అవకాశం!

21-01-2022 Fri 13:51
  • ఏఆర్2929 సన్ స్పాట్ వద్ద పేలుడు
  • గుర్తించిన నాసా సోలార్ అబ్జర్వేటరీ
  • భూ వాతావరణంలోకి భారీగా ఎక్స్ రేలు
  • దాని వల్ల భూ అయస్కాంత క్షేత్రంలో మార్పులు
  • ఇప్పటికే రేడియోలకు అంతరాయం
Solar Flare From Sun Causes Blackouts For Radio
సూర్యుడు కొత్త సైకిల్ లోకి మారుతుండడంతో దాని ఉపరితలం మీద తీవ్రత కూడా పెరుగుతోంది. దీంతో సూర్యుడి మీద జ్వాలలు ఒక్కసారిగా ఎగసిపడుతున్నాయి. నిన్న సన్ స్పాట్ ఏఆర్2929 వద్ద భారీ పేలుడు జరగడంతో ఓ భారీ జ్వాల ఎగసింది. ఎం5.5 క్లాస్ సోలార్ ఫ్లేర్ గా పేర్కొంటున్న ఆ జ్వాలను నాసాలోని సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ క్యాప్చర్ చేసింది.

దాని వల్ల ఎక్స్ రే కిరణాలు భూమి వాతావరణంలోకి చొచ్చుకొచ్చాయని నిపుణులు తేల్చారు. దాని వల్ల హిందూ మహా సముద్ర ప్రాంతంలో రేడియోలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని గుర్తించారు. రేడియో తరంగ దైర్ఘ్యాలు 30 మెగా హెర్ట్జ్ కన్నా తక్కువగా ఉన్న ఏవియేటర్లు,  మెరైనర్లు, రేడియో ఆపరేటర్లకు ఇబ్బంది కలిగిందని పేర్కొంటున్నారు.

సోలార్ ఫ్లేర్ అంటే..

సూర్యుడి మీద పేలుడు జరిగి ఏర్పడే జ్వాలనే సోలార్ ఫ్లేర్ అంటారు. సూర్యుడి అయస్కాంత క్షేత్రాల్లో నిల్వ ఉన్న శక్తి ఒకేసారి బయటకు విడుదలైనప్పుడు ఈ పేలుళ్లు చోటుచేసుకుంటాయి. విశ్వంలోని దాదాపు అన్ని మూలలకు ఆ పేలుడు వల్ల రేడియేషన్ చేరుతుంది. రేడియో తరంగాలు, ఎక్స్ రే, గామా రే వంటివి భూమి సహా ఇతర గ్రహాల వరకు చేరుతాయి. ఎక్స్ రేలు విడుదలైతే దానిని తొలి దశ అని చెబుతారు. రెండో దశలో ప్రొటాన్లు, ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి. దాని శక్తి చాలా తీవ్రంగా ఉంటుంది. మూడో దశలో ఎక్స్ రేల క్షీణత.

నిన్న జరిగిన పేలుడును మధ్య స్థాయి పేలుడుగా సైంటిస్టులు నిర్ధారించారు. దాని వల్ల భూ ధ్రువాల వద్ద ప్రభావం ఎక్కువగా ఉంటుందని, రేడియోలకు అంతరాయం కలుగుతుందని అంటున్నారు. కొన్నికొన్నిసార్లు రేడియేషన్ తుపాన్లు కూడా వస్తాయన్నారు. జనవరి 22, 23, 24వ తేదీల్లో భూమి అయస్కాంత క్షేత్రాల్లో తేడాలు వస్తాయని, చిన్నపాటి అయస్కాంత తుపాన్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ఇప్పటికే సూర్యుడి నుంచి రెండు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ (సీఎంఈ) నమోదయ్యాయని, మూడోది కూడా వస్తోందని చెబుతున్నారు. దాని వల్ల భూమిపై తీవ్రమైన ప్రభావం పడకపోయినప్పటికీ.. చిన్నపాటి జీ1 క్లాస్ అయస్కాంత తుపాన్లు వస్తాయంటున్నారు. సౌర గాలుల నుంచి ఎక్కువ మొత్తంలో శక్తి మార్పిడి జరిగినప్పుడు భూమి అయస్కాంతక్షేత్రంలో కలిగే అలజడి వల్ల ఈ అయస్కాంత తుపాన్లు వస్తాయని వివరిస్తున్నారు.