జగన్ అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ!

20-01-2022 Thu 21:23
  • పీఆర్సీపై ప్రధానంగా చర్చించే అవకాశం
  • సినిమా టికెట్లపై కూడా చర్చిస్తారని సమాచారం
  • పాఠశాలలను కొనసాగించే అంశంపై చర్చించే అవకాశం
Andhra Pradesh cabinet to meet tomorrow
పీఆర్సీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య వార్ నడుస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర సీఎస్ కు రేపు ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె నోటీసు ఇవ్వబోతున్నారు. అంతేకాదు, రేపు అన్ని ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో భేటీ అయి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.

ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ కీలక భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా పీఆర్సీతో పాటు, సినిమా టికెట్ల అంశంపై కేబినెట్లో చర్చించనున్నట్టు సమాచారం. కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న తరుణంలో దీనిపై కూడా చర్చించబోతున్నారు. పాఠశాలలను కొనసాగించే అంశంపై కూడా చర్చించవచ్చని తెలుస్తోంది. పలు సమస్యల నేపథ్యంలో రేపటి కేబినెట్ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం వుంది.