రఘురామకృష్ణరాజు వర్సెస్ విజయసాయిరెడ్డి.. ట్విట్టర్ వేదికగా విమర్శలు.. ప్రతివిమర్శలు!

20-01-2022 Thu 20:38
  • లెక్క పంపిస్తే ఏదైనా చేస్తావన్న విజయసాయి
  • గెలిపించిన ప్రజలను తాకట్టు పెట్టేశావు కదా! అంటూ ఎద్దేవా 
  • నీవు, ఏ1 నన్ను కడతేర్చాలనుకుంటున్నారన్న రఘురాజు
  • మిమ్మల్ని రొచ్చులో తొక్కే రోజు దగ్గర పడిందని వ్యాఖ్య
Saireddy Vs Raghurama
ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మధ్య ఎన్నోసార్లు మాటల తూటాలు పేలిన సంగతి తెలిసిందే. ఎవరికి వారే పదునైన విమర్శలతో చెలరేగిపోయారు. తాజాగా మరోసారి ఇద్దరూ విమర్శలు గుప్పించుకున్నారు. ఇద్దరి మధ్య ట్వీట్ల వార్ జరిగింది. వారిద్దరి ట్వీట్లు వారి మాటల్లోనే చూడండి.

'జీవితాన్ని రొచ్చు చేసుకున్నావు కదా రాజా! ఏదో ప్రాపర్టీనో, వాహనాలనో అద్దెకు ఇచ్చినట్టు... నిన్ను నువ్వే బాడుగకు ఇచ్చుకుని పెయిడ్ మైక్ అయ్యావు. లెక్క పంపిస్తే ట్వీట్లు, స్టేట్ మెంట్లు ఏదైనా చేస్తావు. ఇంత నీచపు జీవితం భారంగా లేదూ? గెలిపించిన ప్రజలను తాకట్టు పెట్టేశావు కదా!' అని విజయసాయి దెప్పిపొడిచారు.

విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు రఘురాజు కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు. 'అవునా? నా జీవితం నీకు, ఏ1కి భారంగా ఉందనే కదా నన్ను కూడా కడతేర్చాలనుకుంటున్నారు... పాపం వివేకానందరెడ్డి లా! ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి, సొమ్ములు దోచేస్తున్న మిమ్మల్ని రొచ్చులో తొక్కే రోజు దగ్గర పడింది మిస్టర్ ఏ2!' అని సెటైర్ వేశారు.