ఏపీలో పాఠశాలలకు సెలవులిచ్చే అంశంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు సురేశ్

20-01-2022 Thu 14:14
  • ఇప్పటికైతే సెలవుల ఆలోచన లేదన్న మంత్రి
  • పిల్లలకు కరోనా వస్తే ఆ స్కూలు వరకు సెలవు
  • శానిటైజ్ చేశాక మళ్లీ తెరుస్తామని వెల్లడి
  • అప్పుడు పీఆర్సీకి ఓకే చెప్పి ఇప్పుడు ఆందోళనలు ఎందుకని ప్రశ్న
  • కేసులు పెరుగుతున్నా రాష్ట్రంలో తీవ్రత లేదని కామెంట్
Not Thinking About Holidays For Schools Says Minister Adimulapu Suresh
ఏపీలో పాఠశాలలకు సెలవులిచ్చే విషయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. ఇటు పీఆర్సీపై ఉద్యోగుల ఆందోళనలపైనా ఆయన మాట్లాడారు. గుంటూరు వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ తో కలిసి ఆయన ఇవాళ ఆన్ లైన్ విద్యావిధానాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సురేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా తీవ్రత అంతగా లేదని చెప్పారు. బడులకు సెలవులను ఇచ్చే ఆలోచన ఇప్పటికైతే లేదని తేల్చి చెప్పారు. పిల్లలకు కరోనా సోకితే.. ఆ పాఠశాల వరకే సెలవు ప్రకటించి శానిటైజ్ చేశాక మళ్లీ తెరుస్తామని స్పష్టం చేశారు. కొన్ని యూనివర్సిటీలు పరీక్షలను కూడా నిర్వహిస్తున్నాయని, కోర్టు కూడా అందుకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.

నాణ్యమైన విద్యను అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. కొత్త కోర్సులను తీసుకొస్తున్నామని తెలిపారు. భవిష్యత్ కోసం ఆన్ లైన్ విద్యావిధానం తప్పనిసరి అని అన్నారు. ఇక సీఎంతో సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా నూతన పీఆర్సీకి అంగీకారం తెలిపారని, అలాంటిది ఇప్పుడు మళ్లీ ఆందోళనలు చేయడం సబబు కాదని ఆయన అన్నారు. ఇబ్బందులుంటే ప్రభుత్వంతో చర్చించవచ్చని సూచించారు. ఇప్పుడు ఆందోళనలు చేయాల్సిన అవసరమేంటని మంత్రి ప్రశ్నించారు.