డ్రగ్స్ వాడుతూ దొరికితే సినీ ప్రముఖులైనా వదిలేది లేదు.. హైదరాబాద్ సీపీ హెచ్చరిక

20-01-2022 Thu 13:39
  • ఇది ఇంటింటి సమస్య అయిందన్న సీవీ ఆనంద్
  • వాడేవారిని నియంత్రించలేకుంటే డ్రగ్స్ అంతంకావు
  • ఈ విషయంపై సీఎం సీరియస్ గా ఉన్నారంటూ వ్యాఖ్య 
We Dont Spare Even Cine Celebrities If They Caught With Drugs Warns Hyderabad CP CV Anand
హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకం ప్రతి ఇంటికీ సమస్యగా పరిణమిస్తోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. డ్రగ్స్ వాడే వారిని నియంత్రించలేనంత వరకూ డ్రగ్స్ ను అంతం చేయలేమని చెప్పారు. డ్రగ్స్ వాడుతూ సినిమా వాళ్లు పట్టుబడినా మినహాయింపు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇకపై సినీ ప్రముఖులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వం, సీఎం సీరియస్ గా ఉన్నారని చెప్పారు.

కాగా, డ్రగ్స్ వాడుతూ పట్టుబడిన 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు డ్రగ్స్ తీసుకుంటున్న మరో 13 మందిని గుర్తించారు. నిరంజన్ కుమార్ జైన్ అనే కాంట్రాక్టర్ దాదాపు 30 సార్లు డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్టు తేల్చారు. నిందితులను శాశ్వత్ జైన్, యగ్యానంద్, సూర్య సుమంత్ రెడ్డి, బండి భార్గవ్, వెంకట్ చలసాని, తమ్మినేని సాగర్, అల్గాని శ్రీకాంత్, బాడి సుబ్బారావులుగా గుర్తించారు. అందులో చాలా మంది ఆర్థికంగా బాగా సెటిలైన వారేనని పోలీసులు చెబుతున్నారు.