హిందూ ధర్మంపై దేశంలోనే తొలి కోర్సు.. బనారస్ యూనివర్సిటీలో ప్రారంభం

20-01-2022 Thu 12:34
  • రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు
  • యూనివర్సిటీ ఏర్పాటైన వందేళ్ల తర్వాత ప్రారంభం
  • 45 మంది విద్యార్థుల చేరిక
BHU offers Hindu Dharma course
వారణాసిలోని ప్రఖ్యాత బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్ యూ) కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. దేశంలో హిందూ ధర్మంపై మొట్టమొదటి కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. హిందూ స్టడీస్ పై పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును ప్రారంభించింది.

ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ విభాగం ద్వారా ఈ కోర్సును అందిస్తోంది. యూనివర్సిటీకి చెందిన భారత్ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్, ప్రొఫెసర్ సదాశివ కమార్ ద్వివేది దీని గురించి మాట్లాడుతూ.. ఒక విదేశీ విద్యార్థి సహా మొత్తం 45 మంది విద్యార్థులు ఈ కోర్సు మొదటి బ్యాచ్ లో చేరినట్టు తెలిపారు. రెండేళ్ల కోర్సు, నాలుగు సెమిస్టర్లుగా, 16 పేపర్లతో ఉంటుందన్నారు.

ఇక ఈ కోర్సును మంగళవారం నాడు యూనివర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ వీకే శుక్లా ప్రారంభించారు. నూతన విద్యా విధానం 2020 కింద ఈ కోర్సు ఉంటుందని ఆయన తెలిపారు. కాగా, 1916లో బనారస్ హిందూ యూనివర్సిటీ ఏర్పాటు కాగా.. హిందూ ధర్మంపై కోర్సు తీసుకురావడానికి వందేళ్లకు పైగా పట్టింది.