Andhra Pradesh: పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలంటూ ఏపీలో కలెక్టరేట్ల వద్ద టీచర్ల భారీ ఆందోళన.. ఎక్కడికక్కడ పోలీసుల మోహరింపు

  • నిన్నరాత్రి నుంచే ఏపీ వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల నేతల అరెస్టులు
  • పలువురు నేతల గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు
  • రోడ్లపై వాహనాలను తనిఖీ చేసి పంపుతున్న పోలీసులు
Teachers Agitation Demanding Against PRC GO

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్లను ముట్టడించాలన్న ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు టీచర్లు భారీగా ఇవాళ రోడ్డెక్కారు. అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లను ముట్టడించారు.

గుంటూరు, అనంతపురం, తూర్పుగోదావరి, విజయనగరం, విశాఖపట్నం, కడప కలెక్టరేట్ల వద్దకు టీచర్లు భారీగా చేరుకున్నారు. దీంతో ఆందోళనకారులు కలెక్టరేట్ల లోపలికి వెళ్లకుండా భారీగా పోలీసులను మోహరించారు.

ఒకపక్క, నిన్న రాత్రి నుంచే ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. కడపలో కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమైన పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజాను ఇంట్లోనే నిర్బంధించారు.

ప్రొద్దుటూరు నుంచి కడప కలెక్టరేట్ కు వెళుతున్న ఉపాధ్యాయులను కొత్తపల్లె చెక్ పోస్ట్ వద్దే అడ్డుకోవడంతో.. వారు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. టీచర్ సంఘాల నేతలను అరెస్ట్ చేయడం పట్ల నెల్లూరు జిల్లాలోని వెంకటాపురం పోలీస్ స్టేషన్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఆత్మకూరు, సంగం చెక్ పోస్ట్ ల వద్ద పోలీసులు తనిఖీలు చేశారు.

చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉద్యోగ సంఘాల నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కుప్పం, పలమనేరు నుంచి చిత్తూరుకు వెళుతున్న టీచర్లను అరెస్ట్ చేశారు. బంగారుపాళ్యం టోల్ గేట్ వద్ద వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కర్నూలు, ఒంగోలు కలెక్టరేట్ లను టీచర్లు ముట్టడించారు. పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో టీచర్ యూనియన్ల ప్రతినిధులను గృహనిర్బంధం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ముందస్తు అరెస్టులు జరిగాయి.  

More Telugu News