Lakshmy Ramakrishnan: ధనుష్, ఐశ్వర్యలను కలిపి పుణ్యం కట్టుకోవాలన్న నెటిజన్.. ఫిల్మ్ మేకర్ లక్ష్మీ రామకృష్ణన్ సమాధానం ఇదీ..

Fan asks Lakshmy Ramakrishnan to bring back Dhanush and Aishwaryaa together
  • వారిద్దరూ పరస్పర గౌరవభావంతో విడిపోతున్నారన్న లక్ష్మి
  • విడాకులకు ముందే వారు తమ మనసులు గాయపరుచుకోలేదని సమాధానం
  • సైలెంట్‌గా విడిపోతే అయిపోయే పనికి ఇంత ప్రచారం ఎందుకన్న అభిమాని
  • సమంతను ఉదాహరణగా పేర్కొన్న లక్ష్మీ రామకృష్ణన్
సెలబ్రిటీల విడాకుల వార్తలు ఇటీవల సర్వసాధారణం అయిపోయాయి. టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత-నాగచైతన్య విడిపోతున్నట్టు చేసిన ప్రకటన ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, అన్ని ‘వుడ్’లలోనూ చర్చనీయాంశమైంది. ఆ వార్తల వేడి ఇంకా చల్లారకముందే కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ తనయ ఐశ్వర్య విడిపోతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 18 ఏళ్ల తమ వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పలుకుతున్నట్టు ఇద్దరూ వేర్వేరుగా సోషల్ మీడియా ద్వారా సోమవారం ప్రకటించారు. దీంతో అభిమానుల గుండెలు చెరువయ్యాయి.

విడిపోతున్నట్టు వీరిద్దరూ చేసిన ప్రకటనపై ఓ అభిమాని భావోద్వేగంతో స్పందించాడు. ధనుష్-ఐశ్వర్యను కలిపి పుణ్యం కట్టుకోవాలంటూ నటి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణ‌న్‌ను కోరాడు. స్పందించిన లక్ష్మి.. వారిద్దరూ పరస్పర గౌరవభావంతో విడిపోతున్నారని గుర్తు చేశారు. బహిరంగంగా ఒకరిపై ఒకరు నోరు పారేసుకోవడం, చట్టబద్ధంగా విడాకులు తీసుకోవడానికి ముందే వేరొకరితో రొమాన్స్ చేయడం ద్వారా ఇద్దరూ ఒకరినొకరు మానసికంగా గాయపరుచుకోవడం లాంటివి చేయలేదన్నారు. కాబట్టి దయచేసి వారిని వదిలివేయాలని కోరారు.

దీనికి అభిమాని బదులిస్తూ.. తాను వారి నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని పేర్కొన్నాడు. అయితే, అది వారి సొంత నిర్ణయం కాబట్టి సైలెంట్‌గా విడిపోతే అయిపోయేదని, వారిలా ప్రచారం చేసుకోవడమే నచ్చలేదని అన్నాడు. ఇలా చేయడం వల్ల అభిమానుల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నాడు. విడాకులు అనేవి ఒకప్పుడు అసాధారణ విషయమని, కానీ సెలబ్రిటీల వల్ల ఇప్పుడివి సర్వసాధారణమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
 
అతడి సమాధానానికి మళ్లీ స్పందించిన లక్ష్మి.. నటి సమంతను ఉదాహరణగా పేర్కొన్నారు. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత సామాజిక మాధ్యమాల ద్వారా అసహ్యకరమైన వార్తలను ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అయితే, వచ్చిన చిక్కంతా ఏంటంటే.. వారు కనుక అలా ప్రకటించకపోయినా.. వారిపై వక్రీకరణ వార్తలు వస్తాయన్నారు. వారి అనుమతి లేకుండానే తప్పుడు ప్రచారం జరుగుతుందని పేర్కొన్నారు. సమంత-నాగచైతన్య గౌరవప్రదంగా విడిపోయిన తర్వాత కూడా చాలా దారుణమైన విషయాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని లక్ష్మి వివరించారు. లక్ష్మీ రామకృష్ణన్ పలు సినిమాల్లో నటించారు. పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.
Lakshmy Ramakrishnan
Dhanush
Aishwarya
Divorce
Samantha

More Telugu News