ఏపీలో కరోనా కలకలం.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు!

19-01-2022 Wed 17:15
  • గత 24 గంటల్లో 10,057 కేసుల నమోదు
  • రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 44,935
Andhra Pradesh registers more than 10000 cases in last 24 hours
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య ఏకంగా 10 వేలను దాటింది. మొత్తం 41,713 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా... 10,057 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. విశాఖ జిల్లాలో 1,827 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,822 కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో 1,222 మంది కరోనా నుంచి కోలుకోగా... 8 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 21,27,441కి చేరుకుంది. వీరిలో 20,67,984 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 14,522 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 44,935 యాక్టివ్ కేసులు ఉన్నాయి.