కులాల గురించి చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు దారుణం: సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి

19-01-2022 Wed 14:45
  • కులాలను నిర్మూలించడం తగదని చిన్నజీయర్ అన్నారు
  • ఏ కులం వారు ఆ పనే చేయాలని ఆయన చెప్పారు
  • జీయర్ మాటలు మధ్య యుగాన్ని గుర్తుకు తెస్తున్నాయన్న వెంకట్ రెడ్డి 
Chinna Jeeyar comments on caste are not acceptable says Chada Venkata Reddy
రామానుజాచార్యుల 1000వ (సహస్రాబ్ది) జయంతి ఉత్సవాలను నిర్వహించే పనుల్లో చిన్నజీయర్ స్వామి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావుతో కలిసి ఆయన దేశంలోని ప్రముఖులందరినీ కలుస్తున్నారు. కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తున్నారు. శంషాబాద్ లోని ముచ్చింతల్ లో ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

మరోవైపు చిన్నజీయర్ స్వామిపై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. ఇటీవలి కాలంలో చిన్నజీయర్ చెప్పిన ప్రవచనాలు జనాల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయని అన్నారు. కులాలను నిర్మూలించడం తగదని ఇటీవల ఆయన అన్నారని... ఏ కులం వారు ఆ కులం పని చేయాలని ఆయన చెప్పారని... మాంసాహారులు ఏం మాంసం తింటారో ఆ జంతువుల మాదిరే వ్యవహరిస్తారని ఆయన చెప్పారని విమర్శించారు. జీయర్ మాటలు మధ్య యుగాన్ని గుర్తుకు తెస్తున్నాయని అన్నారు.

కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రామానుజాచార్యుల విగ్రహానికి 'సమానత్వ ప్రతిమ' అని పేరు పెట్టడం విడ్డూరంగా ఉందని వెంకటరెడ్డి అన్నారు. చిన్నజీయర్ ప్రవచనాలు బహుజనుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు. ఇలాంటి సంకుచిత మనస్తత్వం కలిగిన వ్యక్తి తలపెట్టిన కార్యక్రమానికి రాష్ట్రపతి, ప్రధాని రావడం భారత రాజ్యాంగాన్ని అవమానపరచడమేనని ఆయన అన్నారు.