ఎమ్మెల్సీగా కవిత ప్రమాణం.. కేసీఆర్ కు కృతజ్ఞతలు!

19-01-2022 Wed 14:29
  • ప్రొటెం చైర్మన్ జాఫ్రీ, మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బాధ్యతల స్వీకారం
  • ఇటీవలి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత ఏకగ్రీవం
  • కామారెడ్డి, నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం
Kavita Takes Oath As MLC Today
ఎమ్మెల్సీగా తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ప్రమాణం చేశారు. ప్రొటెం చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ, రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఇతర ఎమ్మెల్సీల సమక్షంలో ఇవాళ మండలిలో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె కామారెడ్డి, నిజామాబాద్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఆమె ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన మీద నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్నందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కూడా ఆమె కృతజ్ఞతలు చెప్పారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన వారందరికీ ఆమె థ్యాంక్స్ చెప్పారు. ఈ కార్యక్రమానికి రాలేకపోయిన పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.