కేంద్ర బడ్జెట్ లో మధ్యతరగతికి రెండు పన్ను ప్రయోజనాలు?

19-01-2022 Wed 13:12
  • స్టాండర్డ్ డిడక్షన్ పెంపు
  • పిల్లల విద్యా పొదుపునకు ప్రత్యేక మినహాయింపులు
  • నిపుణుల అంచనాలు
  • బడ్జెట్ లో వీటిపై స్పష్టత
Standard deduction hike income tax relief for saving for kids education
ఏటా కేంద్ర బడ్జెట్ వస్తుందంటే మధ్యతరగతి ప్రజలు తమకు ఏదైనా ఊరట దక్కుతుందా? అన్న ఆశతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వారి కోసమే 2022-23 బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు రకాల పన్ను ప్రయోజనాలను ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇందులో ఎక్కువ అంచనాలు వినిపిస్తున్నది స్టాండర్డ్ డిడక్షన్ గురించే. స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఆదాయం నుంచి ఆ మేరకు మినహాయించి చూపించుకోవచ్చు. 2005-06లో ఎత్తివేసిన ఈ ప్రయోజనాన్ని తిరిగి 2018-19 బడ్జెట్లో కేంద్ర సర్కారు ప్రవేశపెట్టింది. మొదట రూ.40,000గా ప్రకటించి, ఆ తర్వాత రూ.50,000కు పెంచింది. ఇప్పుడు దీన్ని మరి కొంత పెంచే అవకాశం ఉంది. గతంలో మాదిరే రూ.10,000 పెంచుతారా, లేక మరింత ప్రయోజనం కల్పిస్తారా అన్నది బడ్జెట్ తో తేలిపోనుంది.

పిల్లల విద్యా ఖర్చు గణనీయంగా పెరిగిపోతోంది. సెక్షన్ 80సీ కింద స్కూల్ ట్యూషన్ ఫీజులను చూపించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇదే మంత ప్రయోజనం కాదు. ఎందుకంటే జీవిత బీమా ప్రీమియం, ఈపీఎఫ్, ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ అన్నీ సెక్షన్ 80సీ కిందకే వస్తాయి. పాఠశాల ఉన్నత విద్య, ఇంటర్, ఇంజనీరింగ్ కోర్సుల వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య కోసం చేసే పొదుపు, పెట్టుబడులకు ప్రత్యేక సెక్షన్ కింద ఆదాయం నుంచి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ ఉండగా, దీనిపైనా బడ్జెట్ లో ప్రకటన చేసే అవకాశం ఉందని అంచనా.