కేసినో గురించి మాట్లాడేవారంతా తిరోగమనవాదులే.. జై గుడివాడ!: రాంగోపాల్ వర్మ

19-01-2022 Wed 12:15
  • కేసినో నిర్వహణపై ట్విట్టర్ లో కామెంట్లు
  • గుడివాడ ప్రజలు గోవా వెళ్తారు.. గోవా వారు గుడివాడ రారు
  • గుడివాడను పారిస్, లండన్, లాస్ వేగాస్ లకు దీటుగా నిలిపారు
Ramgopal Varma Satires AP Minister Kodali Nani Over Gudivada Casino Issue
ఏపీ మంత్రి కొడాలి నానిపై రాంగోపాల్ వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుడివాడలోని కె–కన్వెన్షన్ హాల్ లో కేసినో నిర్వహించారని, రూ.500 కోట్లు చేతులు మారాయని, మంత్రి కొడాలి నానినే దానిని దగ్గరుండి నడిపించారంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వర్మ తనదైన శైలిలో స్పందించారు.

గుడివాడకు గోవా సంస్కృతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న కొడాలి నానిని విమర్శిస్తున్న పిచ్చి వాళ్లంతా.. గుడివాడ ప్రజలు గోవా వెళ్తారు గానీ గోవా వారు గుడివాడ రారన్న విషయాన్ని తెలుసుకోవాలంటూ ట్వీట్ చేశారు. గుడివాడను ఆధునికీకరించాలన్న నాని తపనను ప్రశంసించాలని అన్నారు.

‘‘గుడివాడకు కేసినో తీసుకొచ్చిన నాని గురించి మాట్లాడే వారంతా.. గుడివాడను మళ్లీ చీకటి యుగంలోకి నెట్టేస్తున్నారన్న విషయాన్ని గుర్తించాలి. పారిస్, లండన్, లాస్ వేగాస్ కు పోటీగా గుడివాడను నిలిపిన నానిని తప్పకుండా అభినందించాల్సిందే. గుడివాడలో కేసినో వస్తే.. ఎవరైనా గోవా, లాస్ వేగాస్ ల వైపు చూస్తారా? గుడివాడను ఆధునికీకరించాలన్న నాని ఆలోచనకు నేను మద్దతిస్తున్నా. కేసినో గురించి మాట్లాడేవారంతా తిరోగమనవాదులే.. జై గుడివాడ!’’ అంటూ వర్మ ట్వీట్లు చేశారు.