BJP: బీజేపీలో చేరిన ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కోడలు

  • బీజేపీకి రుణపడి ఉన్నానన్న అపర్ణ యాదవ్
  • దేశమే తనకు ప్రధానమని కామెంట్
  • ములాయం రెండో భార్య తనయుడు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ
Mulayam Singh Daughter In Law Aparna Yadav Joins BJP

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ బిష్త్ యాదవ్.. బీజేపీలో చేరారు. యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. పార్టీ సభ్యత్వం పొందారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బీజేపీకి ఎంతో రుణపడి ఉన్నానని అన్నారు. తనకు ఎలప్పుడూ దేశమే ప్రథమమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు అమోఘమని కొనియాడారు. కాగా, ములాయం రెండో భార్య తనయుడు ప్రతీక్ యాదవ్ ను అపర్ణ యాదవ్ వివాహమాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ తరఫున లఖ్ నవూ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి.. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం రీటా లోక్ సభ ఎంపీగా ఉన్నారు.

కంటోన్మెంట్ నుంచి ఇప్పటికే పోటీ ఎక్కువగా ఉండడంతో ఆమెను బక్షీ కా తలాబ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి లఖ్ నవూ కంటోన్మెంట్ నుంచి ఏ అభ్యర్థినీ బీజేపీ ఖరారు చేయలేదు. ఓం ప్రకాశ్ శ్రీవాస్తవ, బలరాంపూర్ హాస్పిటల్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ లోచన్, బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ వికాస్ శ్రీవాస్తవ బాబా, మాజీ ఎమ్మెల్యే దివంగత సురేశ్ శ్రీవాస్తవ కుమారుడు సౌరభ్ శ్రీవాస్తవ, బీజేపీ విధేయురాలు అంజనీ శ్రీవాస్తవ, సంతోష్ శ్రీవాస్తవల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

More Telugu News