కరోనా వేళ సాహసం.. వృద్ధుడిని భుజాలపై కిలోమీటరు దూరం మోసుకెళ్లి ప్రాణాలు నిలిపిన వరంగల్ జిల్లా ఎస్సై!

19-01-2022 Wed 10:12
  • రాయపర్తి మండలం కొండాపూర్ పరిధిలో ఘటన
  • వృద్ధుడిని ముట్టుకునేందుకు దగ్గరకు రాని స్థానికులు
  • స్వయంగా దుస్తులు తొడిగిన ఎస్సై
  • అంబులెన్స్ వరకు కిలోమీటరు దూరం మోసుకెళ్లిన వైనం
Warangal SI carried old man on his shoulders for a distance of a kilometer
పోలీసులు కాఠిన్యంగా ఉంటారనేవారే ఎక్కువ. వారూ మనుషులేనని, వారిలోనూ మానవత్వం దాగి ఉందని నిరూపించే ఘటనలు అప్పుడప్పుడు మాత్రమే వెలుగుచూస్తుంటాయి. తాజాగా, అలాంటి ఘటనే ఒకటి వరంగల్ జిల్లాలో జరిగింది.

జిల్లాలోని రాయపర్తి మండలం కొండాపూర్ పరిధిలోని ఊర చెరువు పక్కన ఓ వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్సై బండారి రాజు.. నడవలేని  స్థితిలో ఉన్న వృద్ధుడిని చూశారు.

కరోనా నేపథ్యంలో ఆయనను ముట్టుకునేందుకు ఎవరూ సాహసించకపోవడంతో ఎస్సై స్వయంగా ఆయనకు లుంగీ కట్టి, చొక్కా తొడిగి 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే, అక్కడి వరకు అంబులెన్స్ వచ్చేందుకు అనువుగా రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఎస్సై సాహసం చేశారు.

వెంటనే వృద్ధుడిని తన భుజాలపై వేసుకుని కిలోమీటరు దూరం నడిచి అంబులెన్స్ వద్దకు చేర్చారు. అక్కడి నుంచి మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించి ప్రాణాలు నిలిపారు. వృద్ధుడి ప్రాణాలు నిలిపేందుకు సాహసం చేసిన ఎస్సైపై ప్రశంసలు కురుస్తున్నాయి.