యూపీలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే మా మొదటి లక్ష్యం: అసదుద్దీన్ ఒవైసీ

19-01-2022 Wed 09:33
  • మత వివక్ష చూపని పార్టీ మాకు కావాలి
  • ఎంఐఎం.. బీజేపీ బి-టీం వ్యాఖ్యలను కొట్టిపడేసిన ఒవైసీ
  • యూపీలో ఒంటరిగానే బరిలోకి
  • తమ పార్టీ భవితవ్యాన్ని ప్రజలే నిర్ణయిస్తారన్న ఎంఐఎం చీఫ్
  • యూపీలో మైనారిటీల దుర్భర పరిస్థితికి కాంగ్రెస్, బీజేపీ, ఎస్పీలే కారణమని మండిపాటు
First aim of our party is to ensure that BJP does not return to power in Uttar Pradesh said Asaduddin
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోమారు అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ‘టైమ్స్ నౌ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

యూపీలో మరే ఇతర రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని తేల్చిచెప్పిన ఆయన.. వంద సీట్లలో పోటీ చేస్తున్న తమ పార్టీ భవితవ్యాన్ని ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టకుండా చూడడమే తమ తొలి లక్ష్యమని, మత వివక్ష చూపని పార్టీ/వ్యక్తి తమకు కావాలని అన్నారు. ఎంఐఎం బీజేపీ బి-టీమ్ అన్న విమర్శలను ఒవైసీ కొట్టిపడేశారు.

అఖిలేశ్ యాదవ్ ‘శ్రీకృష్ణుడి’ వ్యాఖ్యలను ఒవైసీ దుయ్యబట్టారు. శ్రీకృష్ణ భగవానుడు తన కలలోకి వచ్చి యోగి ఆదిత్యనాథ్ ను మధుర నియోజకవర్గం నుంచి బరిలోకి దింపమన్నాడని బీజేపీకి కౌంటర్ ఇస్తూ ఇటీవల అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందిస్తూ, ఇక యూపీ ముఖ్యమంత్రిని తానేనని అఖిలేశ్ యాదవ్ అనుకుంటున్నారని ఒవైసీ వ్యంగ్యంగా అన్నారు. అసలు యూపీలోని ముస్లింల దుర్భర పరిస్థితికి ఎస్పీ, కాంగ్రెస్, బీజేపీలే కారణమని ఆరోపించారు.

ప్రపంచవ్యాప్తంగా మారణహోమాలు, ద్వేషపూరిత ప్రసంగాలు ఎక్కువయ్యాయని ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తాకీర్ రజాఖాన్ వ్యాఖ్యలకు బదులిస్తూ.. యువతలో పేరుకుపోయిన ఆగ్రహావేశాలు ఏదో ఒక రోజు బద్దలు కావడం ఖాయమన్నారు. ఆయన ఏమన్నారన్న దానిని పూర్తిగా తెలుసుకున్నాక దానిపై బహిరంగంగానే స్పందిస్తానని చెప్పారు. హరిద్వార్‌లో ధరమ్ సంసద్‌లో మైనారిటీలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాలు చేయడంపై స్పందిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా మారణహోమాలు, ద్వేషపూరిత ప్రసంగాలు జరుగుతున్నాయన్నారు.

నా యువత కళ్లలో కోపాన్ని చూస్తున్నానని, అది ఏదో ఒక రోజు బద్దలుకావడం ఖాయమని తాను భయపడుతున్నానని రజాఖాన్ అన్నారు. అప్పుడు తాను వారిపై నియంత్రణ కోల్పోతానని, అప్పుడేం జరుగుతుందోనని భయం వేస్తోందని అన్నారు. ఏదో ఒక రోజు వారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే తలదాచుకోవడానికి ఈ దేశంలో చోటుండదన్న విషయాన్ని హిందూ సోదరులకు చెప్పాలనుకుంటున్నానని  రజాఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కాగా, యూపీ ఎన్నికల్లో రజాఖాన్ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతునిస్తున్నారు.