నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించిన శిశువు.. చూసేందుకు ఎగబడుతున్న జనం!

19-01-2022 Wed 06:57
  • బీహార్‌లోని కటిహార్ జిల్లాలో ఘటన
  • ముమ్మాటికీ వైద్యుల నిర్లక్ష్యమేనన్న బాధిత కుటుంబ సభ్యులు
  • గర్భస్థ పిండం ఎదుగుదల సరిగా లేకపోవడం వల్లేనన్న వైద్యులు
woman gives birth to baby with four hands and legs in bihar
బీహార్‌లో ఓ మహిళ నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. కటిహార్ జిల్లాలోని సదర్ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. వింత శిశువు జన్మించిన విషయం పాకిపోవడంతో చూసేందుకు జనం ఎగబడుతున్నారు. శిశువుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులు ఉండడంతో వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ తల్లి మాత్రం తల్లడిల్లిపోయింది. అయితే, తల్లీబిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.

నిజానికి ఆమె కవలలకు జన్మనివ్వాల్సి ఉందని, గర్భస్థ పిండం ఎదుగుదల సరిగా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. అయితే, వైద్య చికిత్సలో లోపం వల్లే ఇలా జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గర్భంతో ఉండగా తీసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో ఈ విషయం ఎప్పుడూ బయటపడలేదన్నారు. వైద్యులు కూడా లోపల శిశువు సరిగా పెరగడం లేదన్న విషయాన్ని తమతో చెప్పలేదని, ఇది ముమ్మాటికీ వైద్యుల నిర్లక్ష్యమేనని ఆవేదన వ్యక్తం చేశారు.