మరోసారి నెగెటివ్ రోల్ చేస్తున్న నాని!

18-01-2022 Tue 18:36
  • నాని తాజా చిత్రంగా 'దసరా'
  • దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల పరిచయం 
  • మరోసారి నాయికగా కీర్తి సురేశ్ 
  • సంగీత దర్శకుడిగా సంతోష్ నారాయణ్  
Dasara movie upadate
మొదటి నుంచి నాని తనని తాను తెరపై కొత్తగా ఆవిష్కరించుకుంటూ వెళుతున్నాడు. ఒక వైపున హీరోగా సక్సెస్ లను అందుకుంటూనే, నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేయడానికి కూడా వెనుకాడటం లేదు. గతంలో ఆయన 'జంటిల్మెన్' .. 'వి' సినిమాలతో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేసి మెప్పించాడు.

ఇక మరోసారి కూడా ఆయన ఈ తరహా సాహసం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని 'దసరా' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలోనే కనిపిస్తాడట. ఈ పాత్రలో కొత్త నాని కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు.

ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. సంతోష్ నారాయణ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగును, త్వరలో మొదలు పెడతారట. ఇక ఈ సినిమాతో పాటు నాని 'అంటే .. సుందరానికీ!' చేస్తున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో నజ్రియా నజీమ్ పరిచయం కానుంది.