ప్రతి ఓటు కీలకమైనదే.. 'నమో' యాప్ ద్వారా కార్యకర్తలకు కీలక సూచనలు చేసిన మోదీ!

18-01-2022 Tue 15:32
  • వారణాసి బీజేపీ కార్యకర్తలకు మోదీ మార్గనిర్దేశం
  • ప్రతి ఒక్కరికి ఓటు విలువ గురించి వివరించాలన్న ప్రధాని
  • కేంద్ర సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించాలని సూచన
Modi gives directions to Varanasi BJP workers from NaMo APP
వచ్చే నెల ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో వారణాసి (మోదీ లోక్ సభ నియోజకవర్గం) బీజేపీ నేతలు, కార్యకర్తలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేశారు. నమో యప్ ద్వారా ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో ప్రతి ఓటు కూడా అత్యంత విలువైనదని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఓటు విలువ ఏమిటో వివరంగా చెప్పాలని, వారు ఓటు వేసేలా చూడాలని అన్నారు.
 
రైతుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను వారికి వివరించాలని మోదీ తెలిపారు. రసాయనాలు లేని ఎరువుల గురించి వారిలో చైతన్యం తీసుకురావాలని చెప్పారు. వారణాసి ప్రజలకు పెద్ద స్థాయిలో లబ్ధి కలిగించిన పలు కేంద్ర పథకాల గురించి కూడా మోదీ మాట్లాడారు. వీటన్నింటిని ఓటర్లకు వివరించాలని తెలిపారు. బీజేపీ మైక్రో డొనేషన్ క్యాంపెయిన్ గురించి కూడా మోదీ ప్రస్తావించారు. పార్టీ ఫండ్స్ కోసం చిన్న మొత్తాల్లో విరాళాలు ఇవ్వాలని కోరారు.  

ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తర్వాత పార్టీ వర్కర్లతో మోదీ మాట్లాడటం ఇదే ప్రథమం. మరోవైపు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ర్యాలీలు, పాదయాత్రలు, రోడ్ షోలపై జనవరి 22 వరకు ఈసీ నిషేధం విధించింది. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి ఏడు విడతల్లో పోలింగ్ జరగబోతోంది. ఫ్రిబ్రవరి 10, 14, 20, 23, 27... మార్చి 3, 7 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. మార్చి 10న కౌంటింగ్ జరుగుతుంది.