చంద్రబాబు, లోకేశ్ లేకుండానే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం

18-01-2022 Tue 15:18
  • నేడు ఎన్టీఆర్ 26వ వర్ధంతి
  • మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమం
  • కరోనా బారినపడిన చంద్రబాబు, లోకేశ్
  • త్వరలోనే కోలుకుని వస్తారన్న అచ్చెన్నాయుడు
NTR death anniversary program at TDP Office
నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు 26వ వర్ధంతి. ఈ సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. వారిద్దరూ కరోనా బారినపడడం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు, లోకేశ్ ఐసోలేషన్ లో ఉన్నారు.

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు, లోకేశ్ ల ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ప్రజల ఆశీస్సులతో వారు కోలుకుని త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కాగా, వర్ధంతి కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొని రక్తదానం చేశాయి.