Vijayashanti: ప్రభుత్వ అనాలోచిత తీరుకు తొమ్మిది మంది ఉద్యోగులు బలయ్యారు: విజయశాంతి

Vijayasanthi reacts on employees problems during transfers
  • జీవో నెం.317పై విజయశాంతి స్పందన
  • ఉద్యోగుల ఉసురు తీస్తున్నారని ఆగ్రహం
  • భర్తను ఓ జిల్లా, భార్యను మరో జిల్లాకు బదిలీ చేస్తున్నారని ఆరోపణ
  • దుర్మార్గపు పాలన అంటూ విమర్శలు
నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆప్షన్ ప్రకారం బదిలీ చేయాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయని బీజేపీ నేత విజయశాంతి పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీవో నెం.317 అనే పంజాకు చిక్కుకుని విలవిల్లాడుతున్నారని తెలిపారు.

బదిలీల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెట్టుకున్న ఆప్షన్లు, ఉద్యోగ సంఘాల ఆలోచనలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఇష్టానుసారం బదిలీలు చేపడుతోందని ఆరోపించారు. ఉద్యోగుల్లో సీనియర్, జూనియర్ అనే చీలిక తేవడమే కాకుండా, భర్తను ఓ జిల్లాకు, భార్యను మరో జిల్లాకు బదిలీ చేస్తూ ఆటలు ఆడుతోందని విజయశాంతి మండిపడ్డారు. దీనిపై ఏంచేయాలో తెలియని ఉద్యోగులు తమ గోడు వెళ్లబోసుకునేందుకు ప్రగతిభవన్ ను ముట్టడిస్తే పోలీసులు లాఠీలకు పనిచెబుతూ వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ అనాలోచిత తీరుతో ఇప్పటికే రాష్ట్రంలో తొమ్మిది మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని విజయశాంతి వివరించారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ లో మార్పులేదని, ప్రాణాలు పోతే పోనీ బదిలీలు మాత్రం ఆగరాదంటూ అధికారులకు హుకుం జారీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను అష్టకష్టాల పాల్జేస్తూ వారి ఉసురు తీస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ దుర్మార్గపు నియంత పాలనను రానున్న ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజలు అంతమొందించడం ఖాయమని విజయశాంతి స్పష్టం చేశారు.
Vijayashanti
Employees
G.O.317
CM KCR
Telangana

More Telugu News