RRR: అల్లూరిని బ్రిటీష్ పోలీసుగా చూపించారంటూ.. 'ఆర్ఆర్ఆర్'పై హైకోర్టులో పిటిషన్

  • కరోనా కారణంగా ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' విడుదల వాయిదా
  • ఈ సినిమాను వెంటాడుతున్న పలు కేసులు
  • చరిత్రను వక్రీకరించారంటూ మరో పిటిషన్ దాఖలు
One more petition filed against RRR

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనాతో పాటు, ఏపీలో టికెట్ ధరల వ్యవహారం సినిమా విడుదలకు కారణమనే సంగతి విదితమే. బాలీవుడ్ స్టార్లు అలియా భట్, అజయ్ దేవగణ్ లతో పాటు హాలీవుడ్ భామ ఒలీవియా కూడా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందీ ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది.

మరోవైపు, ఈ చిత్రం చుట్టూ వివాదాలు కూడా నెలకొన్నాయి. ఈ చిత్రంలో చరిత్రను వక్రీకరించారంటూ ఇప్పటికే కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా మరో పిటిషన్ హైకోర్టులో దాఖలయింది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రను రామ్ చరణ్ పోషించగా, గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషించాడు.

అయితే, అల్లూరిని బ్రిటీష్ పోలీసుగా చూపించారంటూ అల్లూరి యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు వీరభద్రరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. అల్లూరిని బ్రిటీష్ పోలీసుగా చూపించడం దారుణమని ఆయన అన్నారు. అల్లూరి, కుమురం భీమ్ లు కలిసినట్టు చరిత్రలో లేదని, చరిత్రను వక్రీకరించి చూపించిన ఘట్టాలను తొలగించాలని కోరారు.

More Telugu News