టెస్ట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ వద్దంటున్న సునీల్ గవాస్కర్

18-01-2022 Tue 14:23
  • రోహిత్ కు ఫిట్ నెస్ సమస్య
  • ఎప్పుడూ తొడకండరాల గాయాలు
  • ఫిట్ గా ఉండే ఆటగాడే టెస్ట్ కెప్టెన్ కావాలన్న గవాస్కర్
Sunil Gavaskar Has Doubt On Rohit Sharma For Test Captaincy
టెస్ట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ అయితే తప్పుకొన్నాడు, ఓకే. మరి, ఆ తర్వాత ఆ బాధ్యతలు చేపట్టేదెవరు? కోహ్లీ ప్రకటన తర్వాత అందరికీ ఉత్పన్నమైన ప్రశ్న ఇదే. రోహిత్ శర్మకే పగ్గాలు అప్పగించాలన్న వ్యాఖ్యలూ వినిపించాయి. అయితే, టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం అందుకు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు.

రోహిత్ శర్మకు ఫిట్ నెస్ సమస్యలు ఎక్కువన్నారు. ‘‘రోహిత్ శర్మనూ టెస్ట్ కప్టెన్ గా చేయొచ్చు. కానీ, అతడికి ఫిట్ నెస్ సమస్యలు ఎక్కువ. ఎప్పుడైనా ఫిట్ గా ఉండే ఆటగాడు, ప్రతి మ్యాచ్ కూ అందుబాటులో ఉండే ఆటగాడే కావాలి. కానీ, రోహిత్ తరచూ తొడ కండరాల గాయంతో బాధపడుతూ ఉన్నాడు. అందుకే నాకు అతడిపై అనుమానం. కాబట్టి అన్ని ఫార్మాట్లలోనూ ఫిట్ గా ఉండి బాగా ఆడే వ్యక్తినే కెప్టెన్ ను చేయాలన్నది నా అభిప్రాయం’’ అని వ్యాఖ్యానించారు.

తొడ కండరాల గాయం కారణంగా తొలుత దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు దూరమైన రోహిత్.. ఆ తర్వాత మొత్తం సిరీస్ కే దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.