Revanth Reddy: టీఆర్ఎస్ ఈ పని చేస్తే ఎంఐఎంకు ద్రోహం చేసినట్టే: రేవంత్ రెడ్డి

  • యూపీలో ఎంఐఎం 100కు పైగా స్థానాల్లో పోటీ చేయబోతోంది
  • అక్కడ ఎస్పీ తరపున టీఆర్ఎస్ ప్రచారం చేస్తే ఎంఐఎంకు ద్రోహం చేసినట్టే
  • పేద విద్యార్థులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారు
Revanth Reddy fires on KCR

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ తరపున టీఆర్ఎస్ ప్రచారం చేయబోతోందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ఆ పని చేస్తే ఎంఐఎం పార్టీకి మిత్రద్రోహం చేసినట్టేనని అన్నారు. యూపీలో 100కు పైగా స్థానాల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తోందని... అలాంటప్పుడు ఎస్పీ తరపున టీఆర్ఎస్ ప్రచారం చేస్తే ఎంఐఎంకు అన్యాయం చేసినట్టేనని చెప్పారు. తెలంగాణలో ఎంఐఎంకు మిత్రుడిగా ఉన్న టీఆర్ఎస్ యూపీలో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎలా పని చేస్తుందని ప్రశ్నించారు.

పేద విద్యార్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇంగ్లిష్ మీడియం విద్య అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ప్రైవేట్ కాలేజీలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ అది తెలంగాణలో అమలు కావడం లేదని చెప్పారు.

ప్రజల ప్రాణాలంటే కేసీఆర్ కు లెక్కలేదని... అందుకే కరోనాపై ప్రధాని జరిపిన సమీక్షకు ఆయన హాజరు కాలేదని రేవంత్ అన్నారు. వైన్స్, బార్లు, పబ్బులను కేసీఆర్ ఆదాయ వనరులుగా చూస్తున్నారని చెప్పారు. రాష్ట్ర మంత్రులంతా కేసీఆర్ బంట్రోతులేనని ఎద్దేవా చేశారు.

More Telugu News