గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే ముప్పు.. హెచ్చరించిన నిఘా వర్గాలు

18-01-2022 Tue 13:14
  • పాకిస్థాన్, ఆఫ్ఘన్ ఉగ్రవాద సంస్థల ప్రణాళికలు
  • కేడర్ ను తరలిస్తున్న పాక్ లోని ఖలిస్థానీ గ్రూపులు
  • పంజాబ్, ఇతర రాష్ట్రాల్లో దాడులకు కుట్ర
  • డ్రోన్లతో దాడి జరిగే ప్రమాదముందని హెచ్చరికలు
  • అప్రమత్తమైన అధికారులు.. భారీ బందోబస్తు
Security Alert For Prime Minister Republic Day Event
ఈ ఏడాది గణతంత్ర వేడుకలపై ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా ఉగ్రవాద దాడి జరిగే ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రముఖులపై డ్రోన్లతో దాడి చేసే ప్రమాదముందని పేర్కొన్నాయి. ఈ మేరకు తయారు చేసిన తొమ్మిది పేజీల నివేదికలో నిఘా వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

ఈ ఏడాది నిర్వహించనున్న 75వ గణతంత్ర దినోత్సవానికి మధ్య ఆసియా దేశాలైన కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, తుర్కమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల ప్రధానులను భారత ప్రభుత్వం ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లోని పలు ఉగ్రవాద సంస్థలు.. రిపబ్లిక్ వేడుకలతో పాటు జనసమ్మర్థం ఉన్న ఇతర ప్రదేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై డ్రోన్లతో దాడులు చేసేందుకు కుట్ర పన్నాయని నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. లష్కరే తోయిబా, రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహ్మద్, హర్కతుల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ లు ఈ దాడులు చేసే ప్రమాదముందని హెచ్చరించాయి. పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఖలిస్థానీ గ్రూపులూ తమతమ వారిని సిద్ధం చేస్తున్నాయని, పంజాబ్ కు తరలిస్తున్నాయని, పంజాబ్ లో ఉగ్రవాదాన్ని పెంచిపోషించేందుకు కుట్రలు పన్నుతున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి.  

పంజాబ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉగ్రదాడులు జరిపేందుకు ప్రణాళికలు రచించాయని పేర్కొన్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన నిఘా నివేదిక ప్రకారం.. ప్రధాని సమావేశాలు, పర్యటించే ప్రదేశాల్లో దాడులు జరిపేందుకు ఖలిస్థానీ గ్రూపులు దాడులు చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నాయని తెలిపాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. గణతంత్ర వేడుకలు జరిగే ఎర్రకోట వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీలో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.