ఇంకో ఆరు నెలలకు కరోనా కథ ముగింపునకు వస్తుంది: భారతీయ అమెరికన్ డాక్టర్ లోకేశ్వరరావు

18-01-2022 Tue 13:09
  • సాధారణ జలుబు, జ్వరంగా మారుతుంది
  • ఒమిక్రాన్ పై ఆందోళన అక్కర్లేదు
  • ఊపిరితిత్తుల్లోకి వెళ్లక ముందే నిర్వీర్యం
  • తగినంత నిద్ర, వ్యాయామంతో రోగ నిరోధకత
corona become endemic in 6 months
కరోనా వైరస్ మరో ఆరు నెలలకు ఎండెమిక్ స్టేజ్ (సాధారణంగా కనిపించే స్థానిక వ్యాధుల్లో ఒకటిగా) కు వస్తుందన్న అభిప్రాయాన్ని ప్రముఖ భారతీయ అమెరికన్ వైద్య నిపుణుడు, ‘అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్’ గ్లోబల్ మెడికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఈదర లోకేశ్వరరావు వ్యక్తం చేశారు. సాధారణ జలుబు, జ్వరం, దగ్గు మాదిరిగా వైరస్ చేరుకుంటుందని చెప్పారు.

అయితే, ప్రజలు మాత్రం మాస్క్ లు ధరించాలని, టీకాలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఒమిక్రాన్ గురించి ఆందోళన అక్కర్లేదన్నారు. ఇది ఊపిరితిత్తులకు చేరకముందే నిర్వీర్యం అవుతున్నట్టు తెలిపారు. అమెరికాలో వృద్ధ జనాభా ఎక్కువగా ఉండడం, టీకాలు అందరూ తీసుకోకపోవడం, అవగాహన లేమితో కేసులు ఎక్కువగా వస్తున్నట్టు చెప్పారు.

సరిపడినంత నిద్రపోవడం, వ్యాయామం, ధ్యానం చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని డాక్టర్ లోకేశ్వరరావు సూచించారు.