ఏపీ డిప్యూటీ సీఎం ధర్మానకు కరోనా.. దేవినేని ఉమాకు కూడా!

18-01-2022 Tue 12:46
  • వరుసగా కరోనా బారిన పడుతున్న రాజకీయ ప్రముఖులు
  • టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందన్న దేవినేని
  • ఐసొలేషన్ లోకి వెళ్లిపోయిన ధర్మాన
Devineni Uma and Dharmana Krishna Das tests positive for corona
కరోనా థర్డ్ వేవ్ రాజకీయ ప్రముఖులపై పెద్ద ప్రభావమే చూపుతోంది. చంద్రబాబు, నారా లోకేశ్, కొడాలి నాని, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, వంగవీటి రాధా తదితరులు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు.

తాజాగా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా కూడా కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన చెప్పారు. డాక్టర్ సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నానని చెప్పారు.

ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కు కూడా కరోనా సోకింది. తనకు కరోనా నిర్ధారణ కావడంతో ఆయన ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. తనను కలవడానికి ఎవరూ రావద్దని ఆయన కోరారు. తనకు టచ్ లోకి వచ్చిన వారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.