మీ వరంగల్ పర్యటనను ఎందుకు రద్దు చేసుకున్నారు దొరగారు?: షర్మిల

18-01-2022 Tue 12:23
  • సాయం కోసం రోడ్డెక్కిన రైతన్న ఆగ్రహంతో మిమ్మల్ని అడ్డుకొంటారనా?
  • రైతు చావులకు కారణం మీరేనని మిమ్మల్ని నిలదీస్తారనా?
  • కరోనా వస్తుందనా?
Sharmila fires on KCR
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటనను రద్దు చేసుకోవడంపై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శలు గుప్పించారు. వరంగల్ పర్యటనను ఎందుకు రద్దు చేసుకున్నారు దొరా? అని ప్రశ్నించారు. సాయం కోసం రోడ్డెక్కిన రైతన్న ఆగ్రహంతో మిమ్మల్ని అడ్డుకొంటారనా? రైతు చావులకు కారణం మీరేనని మిమ్మల్ని నిలదీస్తారనా? కరోనా వస్తుందనా? లేక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత కాదనా? మీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు ఎందుకు దొరగారు? అని ప్రశ్నించారు. 'పంట వానపాలు, రైతు కష్టం కన్నీటిపాలు, సాయం దొర మాటలకే చాలు' అని విమర్శించారు.
 
పంట నష్టపోయి, పెట్టిన పెట్టుబడి రాక రోజుకు ఇద్దరు, ముగ్గురు రైతులు పురుగుల మందు తాగి చనిపోతుంటే, నష్టపోయిన రైతును ఆదుకోడానికి, రైతును ఓదార్చడానికి ఫామ్ హౌస్ దాటి మీ కాలు బయటపడుతలేదా? అని షర్మిల ప్రశ్నించారు. కష్టకాలంలో రైతులకు భరోసా ఇవ్వడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దని వ్యాఖ్యానించారు.