Covid Treatment Guidelines: అనవసరంగా స్టెరాయిడ్స్ ఇవ్వొద్దు.. రెమిడెసివిర్ అందరికీ కాదు: కేంద్రం మార్గదర్శకాల విడుదల

  • శ్వాస సమస్య లేకపోతే వ్యాధి తీవ్రత లేనట్టే
  • వీరికి స్టెరాయిడ్స్, రెమిడెసివిర్ వాడకూడదు
  • అవసరమైన కేసుల్లోనే స్టెరాయిడ్స్
  • 90కంటే ఆక్సిజన్ తగ్గితే ఐసీయూలో చేర్పించాలి
Avoid Steroids Test If Cough Persists New Covid Treatment Guidelines

కరోనా రోగులకు చికిత్సల విషయంలో అనుసరించాల్సిన ప్రోటోకాల్ విషయమై కేంద్ర ప్రభుత్వం తాజా క్లినికల్ మార్గదర్శకాలను విడుదల చేసింది.

‘‘స్టెరాయిడ్స్ వాడడం వల్ల మ్యూకర్ మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ మాదిరి సెకండరీ ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉంటుంది. కరోనా తొలి రోజుల్లో, అధిక డోసేజీలో ఎక్కువ రోజులు పాటు ఇస్తే ఈ ప్రమాదాలు ఉంటాయి.

శ్వాస ఆడకపోవడం లేదా హైపోక్సియా వంటి లక్షణాలు లేకుండా.. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లక్షణాలు వరకు ఉంటే వ్యాధి స్వల్పంగా ఉన్నట్టు పరిగణించాలి. వీరిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచి సంరక్షణ చర్యలు చేపట్టాలి. శ్వాస ఆడకపోవడం, అధిక జ్వరం, తీవ్రమైన దగ్గు ఐదు రోజులకు పైన ఉంటే వారికి వైద్య పర్యవేక్షణ, చికిత్స అవసరం అవుతాయి.

శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండి, ఆక్సిజన్ శాచురేషన్ 90-93 మధ్య ఉంటే వారిని హాస్పిటల్ లో చేర్పించాలి. మోస్తరు వ్యాధి తీవ్రత కేసులుగా వీటిని చూడాలి. ఈ తరహా రోగులకు ఆక్సిజన్ అందించాలి.

శ్వాస తీసుకునే రేటు నిమిషానికి 30 సార్ల కంటే ఎక్కువగా, గది ఉష్ణోగ్రతలో ఆక్సిజన్ శాచురేషన్ 90కు దిగువన ఉంటే వ్యాధి తీవ్రంగా ఉన్నట్టు పరిగణించాలి. అటువంటి వారిని ఐసీయూలో చేర్చి రెస్పిరేటరీ సపోర్ట్ ఇవ్వాలి. అవసరానికి అనుగుణంగా నాన్ ఇన్వేసివ్ వెంటిలేషన్ లేదా హెల్మెట్ లేదా ఫేస్ మాస్క్ ఆధారంగా ఆక్సిజన్ ఇవ్వాల్సి ఉంటుంది.

వ్యాధి తీవ్రత మోస్తరు నుంచి అధికంగా ఉన్న రోగులకు, అది కూడా లక్షణాలు కనిపించిన తర్వాత మొదటి 10 రోజుల్లోపే రెమిడెసివిర్ ఇవ్వొచ్చు. మూత్ర పిండాలు లేదా కాలేయ సంబంధిత సమస్యలు ఉన్న వారికి దీన్ని ఇవ్వకూడదు. అలాగే, ఆక్సిజన్ అవసరం లేని వారికి కూడా రెమిడెసివిర్ ఇవ్వొద్దు.

వ్యాధి తీవ్రత ఉన్న రోగులకు, ఐసీయూలో చేర్చిన తర్వాత మొదటి 48 గంటల్లోపు టొసిలిజుమాబ్ ఇచ్చి చూడొచ్చు. ఇన్ ఫ్లమ్మేటరీ మార్కర్లు అధికంగా ఉన్న వారికి దీన్ని ఇవ్వడాన్ని పరిశీలించొచ్చు. అది కూడా స్టెరాయిడ్లు ఇచ్చినా ఫలితం రాని కేసుల్లో, ఎటువంటి బ్యాక్టీరియా లేదా ఫంగల్ లేదా ట్యూబర్ క్యులర్ ఇన్ఫెక్షన్ లేని రోగుల్లోనే దీన్ని ఇవ్వడానికి వీలుంటుంది.

దగ్గు రెండు, మూడు వారాలైనా తగ్గకుండా కొనసాగితే ట్యూబర్ క్యులోసిస్, ఇతర పరీక్షలకు సిఫారసు చేయాలి’’అంటూ  కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ మార్గదర్శకాలు విడుదల చేసింది.

More Telugu News