Calf: మూడు కళ్లతో జన్మించిన వింత దూడ... శివుడి ప్రతిరూపం అంటూ పూజలు

  • చత్తీస్ గఢ్ లో ఘటన
  • మకర సంక్రాంతి రోజున జన్మించి దూడ
  • నుదుటి మధ్యలో మూడో కన్ను
  • దేవుడే దిగివచ్చాడంటున్న యజమాని
Three eyed Calf in Chhattisgarh

చత్తీస్ గఢ్ లోని రాజనందగావ్ జిల్లాలో వింత దూడ జన్మించింది. అన్ని దూడలకు రెండు కళ్లు ఉంటే ఈ దూడకు మూడు కళ్లు ఉన్నాయి. శివుడి త్రినేత్రంలా ఈ దూడ నుదుటి మధ్యలో మూడో కన్ను ఉండడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. శివుడి ప్రతిరూపం అంటూ ఆ దూడకు కొబ్బరికాయలు కొట్టి హారతులు పడుతున్నారు. ఆ దూడకు పూజలు చేసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కాగా, ఈ దూడకు రెండు నాసికా రంధ్రాలకు బదులు నాలుగు నాసికా రంధ్రాలు ఉన్నట్టు గుర్తించారు.

ఈ లేగదూడ నీరజ్ అనే వ్యక్తికి చెందినది. ఆయన మీడియాతో మాట్లాడుతూ, దీన్ని తాము భగవంతుని అంశగా భావిస్తున్నామని, దైవం అందరికీ దర్శనమివ్వడానికి ఇలా జన్మించినట్టు అభిప్రాయపడ్డారు. ఈ దూడ మకరసంక్రాంతి రోజున జన్మించిందని వెల్లడించారు. మొదట నుదుటి మధ్యలో ఉన్న కన్నును చూసి అక్కడేదో గాయం అయిందని అనుకున్నామని, టార్చ్ లైట్ వెలుగులో పరిశీలనగా చూస్తే అది కన్ను అని అర్థమైందని వివరించారు.

ఈ వింత దూడను స్థానిక పశువైద్యులు పరిశీలించారు. పిండం సరిగా ఎదగని పరిస్థితుల్లో ఇలాంటి మార్పులతో దూడలు జన్మిస్తుంటాయని వారు వివరించారు. ప్రస్తుతం అది ఆరోగ్యంగానే ఉందని తెలిపారు.

More Telugu News