woman: ప్లాట్ ఫామ్ పై నిలబడిన మహిళను పట్టాలపైకి తోసేసిన ఆగంతుకుడు.. అయినా ఆమె లక్కీ..!

  • బ్రస్సెల్స్ లోని మెట్రో స్టేషన్ లో ఘటన
  • మెట్రో రైలును వేగంగా నిలిపివేసిన డ్రైవర్
  • సురక్షితంగా బయటపడిన మహిళ
  • పోలీసుల అదుపులో నిందితుడు
Woman Pushed In Front Of Train in brussels

అది బ్రస్సెల్స్ (బెల్జియం) లోని రోగిర్ మెట్రో స్టేషన్. నడి వయసు మహిళ మెట్రో రైలు కోసం వేచి చూస్తోంది. కొన్ని సెకన్లలోనే మెట్రో రైలు వచ్చి ప్లాట్ ఫామ్ పై ఆగితే ఆమె ఎక్కి వెళ్లిపోయేది. కానీ, అలా జరగలేదు.

రైలు ప్లాట్ ఫామ్ పైకి రావడానికి సరిగ్గా నాలుగైదు సెకన్ల ముందు ఓ ఆగంతుకుడు వెనుక నుంచి వచ్చి ఆమెను పట్టాలపైకి తోసేశాడు. ఇదంతా కనురెప్పపాటు వేగంలో జరిగిపోయింది. రైలు పట్టాలపైన పడిపోయిన మహిళను మెట్రో డ్రైవర్ వెంటనే గమనించి అత్యవసర బ్రేక్ సాయంతో నిలిపివేశాడు. ప్లాట్ ఫామ్ పై ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.

అదృష్టం ఏమిటంటే మహిళ ప్రాణాలతో బయటపడడమే కాదు.. పెద్దగా గాయాలు కూడా కాలేదు. ఆమె బాగా మందంగల ఉన్నిస్వెటర్ వేసుకోవడం, పడిన తీరు ఆమెను కాపాడాయి. డ్రైవర్ సమయస్ఫూర్తి కూడా రక్షించింది. కానీ, ఈ ఘటనతో రైలు డ్రైవర్ షాక్ కు గురయ్యాడు. దీంతో స్టేషన్ రక్షణ సిబ్బంది మెట్రో పైలట్ ను, మహిళను హాస్పిటల్ కు తరలించారు. ప్రాథమిక చికిత్స చేసి వారిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు.

మహిళను పట్టాలపైకి తోసేసి పరారైన ఆగంతుకుడిని పోలీసులు ఛేదించి మరో మెట్రో స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అలా చేశాడో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. అతడి మానసిక పరిస్థితి తెలుసుకునేందుకు సైకియాట్రిస్ట్ ను నియమించారు.

More Telugu News