Sanjay Manjrekar: కోహ్లీ నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ మంజ్రేకర్

  • దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ లో టీమిండియా ఓటమి
  • కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన కోహ్లీ
  • శుభాకాంక్షలు తెలిపిన మాజీ క్రికెటర్లు
  • భిన్నంగా స్పందించిన మంజ్రేకర్
Sanjay Manjrekar opines on Kohli decision

టీమిండియా టెస్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకోవడం తెలిసిందే. దీనిపై చాలామంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ కోహ్లీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, సంజయ్ మంజ్రేకర్ భిన్నంగా స్పందించాడు.

టెస్టు కెప్టెన్సీ నుంచి తనను తప్పిస్తారన్న విషయం కోహ్లీ ముందే పసిగట్టాడని, అందుకే తానే తప్పుకున్నాడని వ్యాఖ్యానించాడు. తనను తప్పించడానికి మరొకరికి అవకాశం ఇవ్వకూడదని భావించి కోహ్లీ తానే ప్రకటన చేశాడని, కోహ్లీ విషయంలో కొద్దికాలంలోనే పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని మంజ్రేకర్ పేర్కొన్నాడు.

రవిశాస్త్రి నుంచి అందినంత సహకారం కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ నుంచి లభించదని కూడా కోహ్లీ భావించి ఉంటాడని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. గత కొంతకాలంగా కోహ్లీకి ఏదీ కలిసిరావడంలేదన్న అంశం స్పష్టమవుతోందని, అతని ఆటతీరు కూడా ఏమంత ఆశాజనకంగా లేదని విశ్లేషించాడు.

కాగా, ఇటీవలే టీ20 సారథ్య బాధ్యతలను వదులుకున్న కోహ్లీని ఆపై బీసీసీఐ సెలెక్టర్లు వన్డే సారథ్యం నుంచి కూడా తప్పించారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ లో టీమిండియా ఓటమిపాలైన అనంతరం టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై చెప్పాడు.

కాగా, టీమిండియా టెస్టు కెప్టెన్ రేసులో రోహిత్ శర్మ పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే రోహిత్ శర్మ టీ20, వన్డే జట్లకు కెప్టెన్ గా నియమితుడయ్యాడు. అయితే, గవాస్కర్ వంటి మేటి క్రికెటర్లు మాత్రం టీమిండియా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రిషబ్ పంత్ కు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సూచిస్తున్నారు.

More Telugu News