Ghosts: దయ్యాలు ఉన్నాయ్.. నేను బలంగా నమ్ముతున్నా: ఐఐటీ ప్రొఫెసర్ 

  • ఐఐటీ మండీ డైరెక్టర్ గా పని చేస్తున్న లక్ష్మీధర్
  • చెన్నైలో తన స్నేహితుడి ఇంటిని దెయ్యాలు పీడించాయన్న ప్రొఫెసర్
  • తాను వాటిని వెళ్లగొట్టానని వ్యాఖ్య
Ghosts exists says IIT Professor

దెయ్యాలు ఉన్నాయా? లేవా? అనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. దెయ్యాలు ఉన్నాయని కొందరు చెపితే... లేవని హేతువాదులు వాదిస్తుంటారు. దీనిపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి. అయితే, దెయ్యాలు కచ్చితంగా ఉన్నాయని ఐఐటీ మండీ డైరెక్టర్, ప్రొఫెసర్ లక్ష్మీధర్ అన్నారు. దెయ్యాలు ఉన్నాయని తాను బలంగా నమ్ముతున్నానని ఆయన చెప్పారు. వాటిని తాను స్వయంగా తరిమి కొట్టానని కూడా తెలిపారు.

1993లో తాను చెన్నైలో ఉన్నప్పుడు తన స్నేహితుడి కుటుంబాన్ని దెయ్యాలు పీడించాయని లక్ష్మీధర్ చెప్పారు. తాను తన స్నేహితుడి ఇంట్లోకి వెళ్లి హరేరామ హరేకృష్ణ మంత్రంతో పాటు, భగవద్గీతలోని కొన్ని శ్లోకోలను చదివానని, దీంతో దెయ్యాలు తన స్నేహితుడి కుటుంబాన్ని వదిలి వెళ్లాయని తెలిపారు. తన స్నేహితుడి కుటుంబ సభ్యుల్లోకి ఆత్మలు ప్రవేశించినప్పుడు వారు వింతగా ప్రవర్తించారని చెప్పారు.

కాగా, ప్రొఫెసర్ లక్ష్మీధర్ కు మేధావిగా ఎంతో పేరుప్రఖ్యాతులు ఉన్నాయి. ఐఐటీ ఢిల్లీ నుంచి లక్ష్మీధర్ పీహెచ్డీ చేశారు. రోబోటిక్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఆయనకు ఎంతో పేరుంది. అలాంటి వ్యక్తి దెయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

More Telugu News