Oxfam report: 10 మంది భారతీయ శ్రీమంతుల సంపదతో దేశంలోని చిన్నారులందరికీ ఉచిత విద్య అందించొచ్చు!

Wealth Of Indias 10 Richest Enough To Fund School
  • దేశంలో 142 మంది బిలియనీర్లు
  • వీరి వద్ద రూ.53 లక్షల కోట్లు
  • 98 మంది సంపద.. 55 కోట్ల ప్రజల ఆస్తికి సమానం
  • ఆక్స్ ఫామ్ ఇన్ ఈక్వాలిటీ నివేదికలో వెల్లడి  
భారత బిలియనీర్ల సంపద (ఒక బిలియన్ డాలర్, అంతకుమించి సంపద ఉన్నవారు) గడిచిన రెండేళ్లలో రెట్టింపునకు పైగా పెరిగింది. అంతేకాదు బిలియనీర్ల సంఖ్య 39 శాతం పెరిగి గతేడాది 142కు విస్తరించింది. ఈ వివరాలను ఆక్స్ ఫామ్ ఇండియా విడుదల చేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు దావోస్ వేదికగా నేడు జరగనుంది. ఆన్ లైన్ మాధ్యమంలో దీన్ని నిర్వహిస్తుండగా, ప్రధాని నరేంద్ర మోదీ సదస్సును ఉద్దేశించి వర్చువల్ గా మాట్లాడనున్నారు.

భారత్ లోని టాప్ 10 (విలువ పరంగా) ధనవంతుల వద్దనున్న సంపదతో దేశంలోని పిల్లలు అందరికీ పాఠశాల, ఉన్నత విద్యను 25 ఏళ్లపాటు ఉచితంగా అందించొచ్చు. ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు మొదటి రోజు ఆక్స్ ఫామ్ ‘అసమానతల‘పై సర్వే వివరాలను వెల్లడిస్తుంటుంది.  

భారత్ లోని టాప్ 98 ధనవంతులపై ఒక్క శాతం సంపద పన్నును వసూలు చేసినా ఆయుష్మాన్ భారత్ పథకానికి కావాల్సిన నిధులను సమకూర్చుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ అన్నది ఆరోగ్యశ్రీ మాదిరే దేశవ్యాప్తంగా పేద ప్రజలకు ఆరోగ్య బీమాను అందించే సాధనం.

2021 నాటికి 142 మంది భారత బిలియనీర్ల వద్ద ఉమ్మడిగా ఉన్న సంపద విలువ 719 బిలియన్ డాలర్లు. సుమారు 53 లక్షల కోట్లు. దేశంలోని 55.5 కోట్ల ప్రజల వద్ద ఎంత సంపద అయితే ఉందో.. 98 మంది సంపన్నుల దగ్గరా అంతే మేర (రూ.49 లక్షల కోట్లు) ఉంది.  పది మంది అత్యంత సంపన్నులు రోజూ మిలియన్ డాలర్ల చొప్పున (రూ.7.4కోట్లు) ఖర్చు పెట్టుకుంటూ వెళ్లినా, వారి సంపద కరిగిపోయేందుకు 84 ఏళ్లు పడుతుందని ఆక్స్ ఫామ్ తెలిపింది.
Oxfam report
wealth inequality
World Economic Forum
billionaires

More Telugu News