Srisailam: కరోనా ఎఫెక్ట్.. ఆగిన శ్రీశైల మల్లికార్జునస్వామి సర్వ దర్శనం

  • అన్న ప్రసాద వితరణ, పాతాళ గంగలో పుణ్య స్నానాలు కూడా నిలిపివేత
  • వృద్ధులు, గర్భిణులు, చంటి పిల్లల తల్లులు దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని సూచన
  • భక్తులకు కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరన్న ఈవో
Corona affect Srisaila mallikarjuna swamy temple stops sarva darshanas

కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మల్లికార్జునస్వామి సర్వ దర్శనంతోపాటు అన్న ప్రసాద వితరణ, శఠారి, తీర్థం, వేదాశీర్వచనం, పాతళ గంగలో పుణ్య స్థానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు దేవస్థానం ఈవో ఎస్. లవన్న తెలిపారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకుని వచ్చే భక్తుల్లో గంటకు వెయ్యి మందిని మాత్రమే అనుమతిస్తామన్నారు. వృద్ధులు, గర్భిణులు, చంటిపిల్లల తల్లులు, పదేళ్లలోపు పిల్లలతో కలిసి దర్శనానికి రావడాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు.

రేపటి నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆర్జిత సేవల టికెట్లను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే తీసుకోవాలని కోరారు. ఆలయాన్ని సందర్శించే భక్తులకు కరోనా వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరని పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా ఇప్పటికే గర్భాలయ టికెట్లు పొందిన వారికి గర్భాలయ అభిషేకాలు తిరిగి ప్రారంభమైన తర్వాత వారు కోరుకున్న రోజుల్లో అభిషేకాలు జరిపించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఈవో లవన్న తెలిపారు.

More Telugu News