CM KCR: పరిపాలన సంస్కరణల దిశగా కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్

  • ప్రగతిభవన్ లో ఉన్నతాధికారులతో సమీక్ష
  • నలుగురు ఐఏఎస్ అధికారులతో సంస్కరణల కమిటీ
  • పాలనా యంత్రాంగంపై కమిటీ అధ్యయనం
  • ప్రభుత్వానికి సూచనలు చేయాలన్న సీఎం కేసీఆర్
CM KCR constitutes four member committee

తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పరిపాలనా సంస్కరణల దిశగా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి  స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ, కమిషనర్ శేషాద్రి అధ్యక్షత వహిస్తారు. ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సభ్యులుగా ఉంటారు.

కొత్తగా ఏర్పడిన జిల్లాలు, మండలాల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని ఒత్తిడి ఏమేరకు ఉందో గుర్తించడం, కొత్తగా ఉద్యోగాల అవసరాన్ని అంచనా వేయడం ఈ కమిటీ విధి. ఆయా ప్రభుత్వ శాఖలు తమ పనితీరు మెరుగుపర్చుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఈ కమిటీ నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. వీఆర్ఓలు, వీఆర్ఏల సేవలను ఏ రీతిలో ఉపయోగించుకోవాలన్నది కూడా ఈ పరిపాలన సంస్కరణల కమిటీ అధ్యయనం చేయనుంది.

సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని, అటు, పరిపాలన సంస్కరణల పరంగానూ మరింత మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే ఈ కమిటీ ఏర్పాటు చేసినట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. వైద్య ఆరోగ్య, పురపాలక, విద్య, పంచాయతీరాజ్ వంటి ప్రధాన శాఖల పనితీరు మెరుగుపర్చడం, ఉద్యోగుల సేవల వినియోగం, మౌలిక సదుపాయాల ఏర్పాటు వంటి అంశాల్లో ఐఏఎస్ అధికారుల కమిటీ తగు సూచనలు చేయాలని కేసీఆర్ నిర్దేశించారు.

More Telugu News