మారుతి కార్ల ధరలు మరోసారి పెరిగాయి!

16-01-2022 Sun 15:54
  • ఉత్పత్తి వ్యయం అధికం
  • లోహాలు, ప్లాస్టిక్ ధరలు పెరిగిన వైనం
  • తాము కూడా పెంచక తప్పడంలేదన్న మారుతి
  • ఈసారి ఏకంగా 4.3 శాతం పెంపు
Maruti Suzuki hikes prices again
కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఉత్పత్తి వ్యయాన్ని భర్తీ చేసుకోవడం కోసం మరోసారి ధరల పెంపు బాటపట్టింది. వాహన తయారీకి కీలకంగా భావించే అల్యూమినియం, ఉక్కు, రాగి వంటి లోహాలతో పాటు ప్లాస్టిక్ ధరలు పెరగడంతో తాము కూడా ధరలు పెంచక తప్పడంలేదని మారుతి వర్గాలు చెబుతున్నాయి. తాజాగా గరిష్టంగా 4.3 శాతం ధరలు పెంచినట్టు వెల్లడించింది. మోడళ్లను బట్టి 0.1 శాతం నుంచి 4.3 శాతం మధ్య పెంపుదల ఉంటుందని వివరించింది. నిర్వహణ ఖర్చులు కూడా అధికం కావడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మారుతి సుజుకి తెలిపింది.

మారుతి సంస్థ 2021లో మూడు పర్యాయాలు ధరలు పెంచింది. గతేడాది స్వల్ప మొత్తంలో ధరలు పెంచిన ఈ కార్ల తయారీ దిగ్గజం, ఈసారి భారీగా పెంచింది. మారుతి సుజుకి సంస్థ ఆల్టో, సెలెరియో, వాగన్ ఆర్, స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, ఈకో, ఎర్టిగా, ఎస్ ప్రెసో, బ్రీజా, డిజైర్, బాలెనో, నెక్జా ఎస్ క్రాస్ వంటి వాహనాలను విక్రయిస్తూ భారత మార్కెట్ లో పట్టు సాధించింది.