ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరవింద్ ను పరామర్శించిన టీడీపీ నేతలు
- జొన్నలగడ్డలో వైఎస్సార్ విగ్రహ ధ్వంసం ఘటన
- ఇద్దరు టీడీపీ కార్యకర్తల అరెస్ట్
- వారిని విడుదల చేయాలంటూ అరవింద్ ఆధ్వర్యంలో ధర్నా
- తోపులాటలో అరవింద్ కు గాయాలు
- నరసరావుపేటలో టీడీపీ నేతల ర్యాలీ
విగ్రహ ధ్వంసం ఘటనలో పోలీసులు ఇద్దరు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయగా, వారిని వదిలిపెట్టాలంటూ అరవింద్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగ్గా, అరవింద్ గాయపడ్డాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరవింద్ ను టీడీపీ నేతలు నేడు పరామర్శించారు. ప్రస్తుతం అరవింద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా, టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, జవహర్, మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, తెనాలి శ్రావణ్ కుమార్, జీవీ ఆంజనేయులు తదిరులు నరసరావుపేటలో ర్యాలీ నిర్వహించారు. నల్ల కండువాలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. టీడీపీ కార్యకర్తల అరెస్ట్ అక్రమం అని, వారిని విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. నరసరావుపేట టీడీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది.