ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టులో జకోవిచ్ కు చుక్కెదురు

16-01-2022 Sun 14:22
  • వ్యాక్సిన్లు తీసుకోకుండా ఆస్ట్రేలియా వచ్చిన జకోవిచ్
  • నిర్బంధించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం
  • ఫెడరల్ కోర్టుకు చేరిన వ్యవహారం
  • ప్రభుత్వ నిర్ణయానికే కోర్టు మద్దతు
  • జకోవిచ్ ఆస్ట్రేలియాను వీడాలని స్పష్టీకరణ
Federal Court denies Novak Djokovic appeal to stay in Australia
ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడేందుకు చేసిన చివరి ప్రయత్నం ఆవిరైంది. తన వీసాను పునరుద్ధరించుకోవడానికి జకోవిచ్ ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టును ఆశ్రయించగా, అక్కడ చుక్కెదురైంది. కరోనా వ్యాక్సిన్లు తీసుకోకుండా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టేందుకు యత్నించడం సరికాదని, జకోవిచ్ వీసాను ప్రభుత్వం రద్దు చేయడం సబబేని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. జకోవిచ్ ను ఆస్ట్రేలియా నుంచి తిప్పిపంపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఫెడరల్ కోర్టు మద్దతు పలికింది. తనకు అనుమతి ఇవ్వాలంటూ జకోవిచ్ చేసుకున్న అప్పీల్ ను తోసిపుచ్చింది.

ఫెడరల్ ధర్మాసనం నిర్ణయంతో జకోవిచ్ ఆస్ట్రేలియాను కొన్ని గంటల్లోనే వీడాల్సి ఉంటుంది. కరోనా వ్యాక్సిన్లు తీసుకోని వ్యక్తిని ఆస్ట్రేలియా గడ్డపై తిరగడానికి ఎలా అనుమతించగలమని వాదనల సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఒకవేళ జకోవిచ్ కు అనుమతి ఇస్తే వ్యాక్సిన్ వ్యతిరేకులకు అతడు ఐకాన్ గా మారతాడని, అందరూ అతడి బాటలో వ్యాక్సిన్లు తీసుకోకుండా స్వేచ్ఛగా తిరిగే ప్రయత్నం చేస్తారని వారు వివరించారు. ప్రభుత్వ న్యాయవాదుల అభిప్రాయాలతో ఫెడరల్ కోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించింది.

కాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ ఓపెన్ రేపు (జనవరి 17) మెల్బోర్న్ లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో జకోవిచ్ టాప్ సీడ్ గా ఆడాల్సి ఉంది. జకోవిచ్ ఈ టోర్నీ నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో వరల్డ్ నెం.150 సాల్వటోర్ కరుసో అవకాశం దక్కించుకున్నాడు. చివరి అవకాశం కూడా విఫలం కావడంతో జకోవిచ్ దుబాయ్ పయనం కానున్నాడు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం ఇటీవల ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన జకోవిచ్ ను భద్రతా బలగాలు నిర్బంధించడం తెలిసిందే. వ్యాక్సిన్లు తీసుకోని కారణంగా అతడి వీసా రద్దు చేశారు. అయితే కోర్టులో అతడికి ఊరట కలిగినా, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి అలెక్స్ హాక్ తన విశిష్ట అధికారాన్ని ఉపయోగించి జకోవిచ్ వీసాను మళ్లీ రద్దు చేశారు. మరోసారి అతడిని కరోనా నిర్బంధం కేంద్రానికి తరలించారు.

అయితే ఆస్ట్రేలియాలో ఉండేందుకు చివరి ప్రయత్నంగా జకోవిచ్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించగా, అక్కడా నిరాశ తప్పలేదు. రెండుసార్లు వీసా రద్దు కావడంతో అతడు మరో మూడేళ్ల పాటు ఆస్ట్రేలియాలో ప్రవేశించలేడు.