Lata Mangeshkar: పూర్తిగా కుదుటపడని లతా మంగేష్కర్ ఆరోగ్యం.. ఇంకా ఐసీయూలోనే

Lata Mangeshkar health update Veteran singer to remain in ICU
  • ఆసుపత్రిలోనే చికిత్స కొనసాగించాల్సిన కండీషన్
  • వేచి చూడాలంటున్న డాక్టర్ ప్రతీత్ సందాని
  • ఆమె కోలుకోవాలని ప్రార్థిద్దామంటూ పిలుపు
స్వర దిగ్గజం, విఖ్యాత గాయని లతా మంగేష్కర్ (92) కరోనాతో ఇంకా పోరాడుతూనే ఉన్నారు. కరోనా పాజిటివ్ రావడంతో సరిగ్గా వారం రోజుల క్రితం ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆమెకు ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మొదట ఆమె ఆరోగ్య పరిస్థితి మంచిగానే ఉందంటూ కుటుంబ సభ్యులు మీడియాకు సమాచారం ఇచ్చారు. వైద్యులు సైతం ఆందోళన అక్కర్లేదన్నట్టే సంకేతం ఇచ్చారు. వారం రోజులు గడిచినా కానీ, ఆమెను వైద్యులు డిశ్చార్జ్ చేయకపోవడంతో ఇంకా కోలుకోవాల్సి ఉందని తెలుస్తోంది.

లతా మంగేష్కర్ కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని వేడుకోవాలంటూ ఆమెకు వైద్యం చేస్తున్న డాక్టర్ ప్రతీత్ సందాని తాజాగా పిలుపునిచ్చారు. ‘‘ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలోనే ఆమె ఉన్నారు. మనం వేచి చూడాల్సిందే. ఇప్పుడే ఏం చెప్పినా కానీ అది తొందరపాటే అవుతుంది. త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఆమె ఆసుపత్రిలోనే మరో 10 రోజుల పాటు ఉండాల్సి వస్తుంది’’అని ప్రతీత్ సందాని పేర్కొన్నారు.

లతా మంగేష్కర్ సోదరి ఆశాభోంస్లే సైతం స్పందించారు. కరోనా పాజిటివ్ కావడంతో సోదరిని చూసేందుకు అనుమతించడం లేదని తెలిపారు. ‘‘ఒక్కసారి నేను ఆసుపత్రికి వెళ్లినా కానీ కాంపౌండ్ లోకి అనుమతించలేదు. కానీ దీదీ పరిస్థితి మెరుగుపడుతోంది’’అని భోంస్లే తెలిపారు.
Lata Mangeshkar
health
covid

More Telugu News