Puri Jagannadh: మహిళల కన్నీళ్లు తుడిచే పాట అది.. తప్పుగా అర్థం చేసుకున్నానన్న పూరీ జగన్నాథ్

  • పూరీ మ్యూజింగ్స్ లో ‘నో విమెన్ నో క్రై’ పాటపై వివరణ
  • మహిళలు ఏడవకూడదని అర్థమన్న డైరెక్టర్
  • జమైకా తప్ప అన్ని దేశాల్లోనూ తప్పుగానే అర్థం చేసుకున్నారని కామెంట్
Puri Jagannadh Explains About No Women No Cry Song

మహిళలు ఎప్పుడూ ఏడ్వకూడదని, ప్రపంచంలో ఆడోళ్లు లేకపోతే ఏడుపులు ఉండవన్న ఆలోచనే తప్పని ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అన్నారు. ‘పూరీ మ్యూజింగ్స్’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పటాయ్ లోని బీచ్ పక్కన ఉన్న రెస్టారెంట్ లో కూర్చున్నప్పుడు ఓ వ్యక్తి బాబ్ మార్లే పాటలు పాడిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ కామెంట్లు చేశారు. ‘నో విమెన్ నో క్రై’ అనే పాటను పాడేటప్పుడు రెస్టారెంట్లోని వాళ్లంతా అరుపులు, విజిల్స్ వేశారని, అక్కడే ఉన్న మహిళలంతా చిన్నబుచ్చుకున్నారని గుర్తు చేశారు.

రెస్టారెంట్లోని మగవారూ ఆ పాటకు గొంతు కలిపారన్నారు. అయితే, ఆ పాట భావాన్ని తనతో పాటు అక్కడ ఉన్న అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని పూరీ చెప్పారు. అది ‘నో విమెన్ నో క్రై’ కాదు అని, ‘నో విమెన్ న క్రై’ అని అన్నారు. ఆ పాట అర్థం ‘మహిళలెవరూ ఏడ్వకూడదు’ అని వివరించారు. వాస్తవానికి ఆ పాటను రాసింది బాబ్ మార్లే కాదని, విన్సెంట్ ఫోర్డ్ రాసిన మాటలను తీసుకుని బాబ్ మార్లే పాడాడని చెప్పారు.

ఒక్క జమైకా తప్ప అన్ని దేశాల్లోనూ ఆ పాటను తప్పుగానే అర్థం చేసుకున్నారని చెప్పారు. ‘నో విమెన్ నో క్రై’ అనే పదాన్ని తప్ప.. వేరే లిరిక్స్ ను ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇకపై ఆ పాట విన్నప్పుడు గోల చేయకూడదని, అది ఆడవాళ్ల కన్నీళ్లు తుడిచే పాట అని తెలిపారు.

More Telugu News