Pig: వ్యాపారంలో విద్యార్థులు విజయం సాధించాలని.. బహుమతిగా పందుల్ని ఇస్తున్న పాఠశాల యాజమాన్యం!

  • చైనాలో యునాన్ ప్రావిన్స్‌లో ఘటన
  • పందుల్ని ఇవ్వడం వల్ల విద్యార్థుల కుటుంబాలకు చేయూత లభిస్తుందన్న పాఠశాల యాజమాన్యం 
  • వాటిని పెంచి అమ్మడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చని స్పష్టీకరణ
Chinies students receive piglets as a reward for hard work

గ్రామీణ వాణిజ్యంలో విజయం సాధించాలన్న ఉద్దేశంతో చైనాలోని ఓ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు పందులను బహుమతిగా ఇస్తోంది. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజం. యునాన్ ప్రావిన్స్‌ ఇలియాంగ్ ప్రాంతంలోని షియాంగ్‌యాంగ్ ప్రాథమిక పాఠశాల ఇలా విద్యార్థులకు పందులను బహుమతిగా ఇచ్చింది. మొత్తం 20 మంది విద్యార్థులు పందుల్ని బహుమతులుగా అందుకున్న వీడియో చైనా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో స్పందించిన పాఠశాల యాజమాన్యం.. పందుల్ని బహుమతులు ఇవ్వాలన్న తమ ఉద్దేశం వెనక దీర్ఘకాలిక లక్ష్యం ఉందని, గ్రామీణ వాణిజ్యంలో వారు అభివృద్ధి సాధించాలని తాము కోరుకుంటున్నామని పేర్కొంది.

తమ పాఠశాలలో ఎక్కువగా గ్రామీణ ప్రాంత విద్యార్థులే ఉన్నారని, పందుల్ని బహుమతులుగా ఇవ్వడం వల్ల వారికి, వారి కుటుంబాలకు చేయూత లభిస్తుందని వివరించింది. తాము ఇచ్చే ఈ బహుమతుల వల్ల వెంటనే లాభాలు రాకపోవచ్చని, కానీ వాటి పెంపకం వల్ల, లేదా కొంతకాలం పెంచి విక్రయించడం వల్ల దీర్ఘకాలంలో లాభాలు ఆర్జించవచ్చని పేర్కొంది. అంతేకాదు, అలా వచ్చిన సొమ్ము విద్యార్థుల చదువుకు ఉపయోగపడడంతోపాటు గ్రామీణ వాణిజ్యం కూడా జరుగుతుందని పేర్కొంది. తాము బహుమతిగా పందులు ఇవ్వడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చదువు, వాణిజ్యం రెండూ అభివృద్ధి చెందుతాయని పాఠశాల యాజమాన్యం స్పష్టం చేసింది.

More Telugu News